న్యూఢిల్లీ : హర్యానా భూ ఒప్పందానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసు విచారణ నిమిత్తం ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా మరోసారి ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈరోజు ఆయన వెంట ప్రియాంక కూడా వెళ్లారు. విచారణకు హాజరయ్యే ముందు వాద్రా మీడియాతో మాట్లాడుతూ… ‘మోడీ ప్రభుత్వాన్ని విమర్శించిన వారిపై ఇడితో సహా ఇతర ఏజెన్సీలు దాడులు చేస్తాయి. ప్రభుత్వ తీరును దేశంలోని ప్రతిఒక్కరూ గమనిస్తున్నారు. ఈ ఏజెన్సీలపై ప్రజలకు విశ్వాసం సన్నగల్లుతోంది. అసలు సమస్యల నుంచి ప్రజల దష్టి మరల్చేందుకే ఇలా చేస్తున్నారు. నాపై చేస్తున్న తప్పుడు ఆరోపణలకు వ్యతిరేకంగా నేను పోరాటం చేస్తాను. ప్రజలు నా వెంటనే ఉన్నారు. వారు నన్ను రాజకీయాల్లో చూడాలనుకుంటున్నారు’ అని అన్నారు.
కాగా, ఈ మనీలాండరింగ్ కేసుకు సంబంధించి వాద్రా ఢిల్లీ ఇడి కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. నిన్న దాదాపు ఆరు గంటలపాటు అధికారులు ఆయనను విచారించారు. అనంతరం బుధవారం కూడా విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.
