Union Budget : లోక్‌సభకు రూ.903 కోట్లు, రాజ్యసభకు రూ.413 కోట్లు

న్యూఢిల్లీ :   కేంద్ర బడ్జెట్‌లో లోక్‌సభకు రూ.903కోట్లు కేటాయించారు. ఇది రాజ్యసభకు కేటాయించిన మొత్తం కన్నా రెండింతలు ఎక్కువ. మొత్తం రూ.903 కోట్లలో లోక్‌సభ సెక్రటేరియట్‌కు రూ.558.81 కోట్లు కేటాయించినట్లు సంబంధిత వర్గాలు ఆదివారం పేర్కొన్నాయి. వీటిలో సంసద్‌ టివి గ్రాంట్లు కూడా ఉన్నాయని అన్నారు. రూ.413 కోట్లు రాజ్యసభకు కేటాయించగా, రూ. 2.52 కోట్లు రాజ్యసభ సెక్రటేరియట్‌లో చైర్మన్‌, డిప్యూటీ చైర్మన్‌ల జీతాలు, అలవెన్సుల కోసం కేటాయించబడ్డాయి.

రాజ్యసభ బడ్జెట్‌లో రాజ్యసభ సెక్రటేరియట్‌లోని ప్రతిపక్ష నేతల జీతాలు, అలవెన్సుల కోసం ప్రత్యేకంగా రూ.3 కోట్లు కేటాయించారు. రాజ్యసభలోని 245 మంది సభ్యుల కోసం రూ.98.84 కోట్లు కేటాయించారని అన్నారు.

లోక్‌సభ బడ్జెట్‌లో స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ల జీతాలు, అలవెన్సుల కోసం రూ.1.56 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. లోక్‌సభలో సభ్యుల కోసం రూ.338.79 కోట్లు కేటాయించగా, లోక్‌సభలో 543 మంది సభ్యులు ఉన్నారు. అయితే ప్రతిపక్ష నేత కార్యాలయానికి ప్రత్యేక కేటాయింపులు లేవని అన్నారు. గత పదేళ్లుగా లోక్‌సభలో ప్రతిపక్ష నేత ఎవరూ  లేరు.

➡️