ఆర్‌ఎస్‌ఎస్‌ భారత్‌ పాలిట రాచపుండే : తుషార్‌ గాంధీ

Mar 15,2025 09:03 #king of India, #RSS, #Tushar Gandhi
  • ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు

కోచి : భారత్‌ పాలిట రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు (ఆర్‌ఎస్‌ఎస్‌) రాచపుండేనని మహాత్మాగాంధీ మనుమడు తుషార్‌ గాంధీ శుక్రవారం పునరుద్ఘాటిం చారు. ఈ వ్యాఖ్యలకు తానేమీ చింతించడం లేదని, క్షమాపణలు చెప్పాల్సిన అవసరమే లేదని ఆయన తేల్చిచెప్పారు. ‘నేనన్నదానికి క్షమాపణలు చెప్పాలని వారు కోరుకుంటున్నారు. నా ప్రకటనను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. కానీ నేనది చేయను. ఒకసారి అన్న తర్వాత దాన్ని వెనక్కి తీసుకోవడంలో లేదా క్షమాపణ చెప్పడంలో నాకు నమ్మకం లేదు’ అని తుషార్‌ గాంధీ చెప్పారు. ఎర్నాకులంలోని అలువాలో యూనియన్‌ క్రిస్టియన్‌ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వైకోమ్‌ సత్యాహ్రంలో పాల్గొన్న తర్వాత మహాత్ముడు మార్చి 18, 1925న ఈ సంస్థను సందర్శించారు. ఆయన పర్యటన వందేళ్ళ వేడుకల సందర్భంగా కేంపస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో తుషార్‌ ప్రసంగించారు. శివగిరి మాధమ్‌ వద్ద మహాత్ముడితో శ్రీ నారాయణ గురు సమావేశం శత వార్షికోత్సవం సందర్భంగా ఇచ్చిన ప్రసంగంలో తుషార్‌, ఆర్‌ఎస్‌ఎస్‌పై పైవ్యాఖ్యలు చేశారు. తిరువనంత పురం శివార్లలో ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి కార్యకర్తలు బుధవారం సాయంత్రం తుషార్‌ గాంధీని నిర్బంధించారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ సంఘట నతో దేశద్రోహులను ఎండగట్టాలన్న తన కృతనిశ్చయం మరింత బలోపేతమైం దని ఆయన వ్యాఖ్యానించారు. పైగా, ప్రతిపక్షాన్ని కూడా గౌరవించే సంస్కృతి మలయాళీలదని, ఇక్కడ ప్రజల హక్కులు పరిరక్షించబడతాయని అటు వంటి కేరళలో ఇలాంటి సంఘటన జరగడం తనకు దిగ్భ్రాంతి కలిగిం చిందన్నారు. ఈ తరహా విషపూరితమైన ప్రజలను రాష్ట్రం నుండి బయటకు పంపించాలన్నారు. స్వాతంత్య్ర పోరాటం కన్నా మరింత ముఖ్యమైనది ఈ పోరాటమని ఆయన వ్యాఖ్యానించారు. మనందరికీ ఉమ్మడి శత్రువు వున్నారన్నారు.

➡️