పూణె : ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ మరో కపట నాటకానికి తెర తీశారు. వారణాసిలో జ్ఞాన్ వాపి, మధురలో షాహి ఈద్గా, శంభాల్‌లోని షాహి జామా మసీదుల కింద ఆలయాలు ఉన్నాయంటూ ఒక వైపు మత విద్వేషాలను రెచ్చగొడుతూ, మరో వైపు మందిర్-మసీదు వివాదాలు తలెత్తుతుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ‘విశ్వగురు భారత్’ అన్న అంశంపై సహజీవన్ అనే ఓ ఎన్‌జివో సంస్థ గురువారం నాడిక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మోసపూరిత ప్రకటనలకు పెట్టింది పేరైన ఆరెస్సెస్ చీఫ్ లెక్చరిస్తూ, ”ఉగ్రవాదం, దుందుడుకుతనం, బలవంతపు చర్యలు, ఇతర దేవుళ్లను కించపరచడం మన దేశ లక్షణం కాదని” సెలవిచ్చారు. ఇతర మతాలను కించపరిచే ధోరణి పెరుగుతోందని, ఇది మంచిది కాదని అన్నారు. వారణాసిలో గ్యాన్‌వాపి మసీదు వివాదంపై తదుపరి సర్వేకు సంబంధించిన కేసులో విచారణను అలహాబాద్ హైకోర్టు వాయిదా వేసిన కొద్ది సేపటికే ఆరెస్సెస్ చీఫ్ ఈ సూక్తి ముక్తావళిని వినిపించడం గమనార్హం. దశాబ్దాల నాటి మసీదులు హిందూ ఆలయాలను కూలదోసి కట్టారంటూ కోర్టుల్లో సంఫ్‌ు పరివార్ గ్రూపులు దేశవ్యాపితంగా కోర్టుల్లో పిటిషన్లు మీద పిటిషన్లు వేస్తూ, మత ఘర్షణలు రెచ్చగొడుతుంటే ఎన్నడూ నోరు మెదపని భగవత్ మత సామరస్యం, దయాగుణం గురించి లెక్చరిస్తున్నారు. అంబేద్కర్ గురించి రాజ్యసభలో అమిత్‌షా చేసిన అవమానకర వ్యాఖ్యలపై దేశవ్యాపితంగా నిరసనాగ్రహాలు వ్యక్తమవుతున్న తరుణంలో దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ కపట నాటకానికి తెర తీసినట్లు పరిశీలకులు పేర్కొంటున్నారు. మత విభజనలు సృష్టించడం ద్వారా ‘హిందూ లీడర్లు’ కాలేరు, మసీదుల కింద శివలింగాల గురించి వెతకొద్దు, భారత్‌లో అందరూ సామరస్యంతో జీవిస్తున్నారని ప్రపంచానికి సందేశమివ్వాలి వంటి డైలాగులను ఆయన వల్లించారు. రైతుల ఉద్యమాన్ని ఆరెస్సెస్ కనుసన్నల్లోని బిజెపి ప్రభుత్వం ఒక వైపు అణచివేస్తుంటే, ఈయనగారు రైతుల పరిస్థితి పై మొసలి కన్నీరు కార్చారు. భగవత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపి శశి ధరూర్ ఎక్స్‌లో స్పందిస్తూ ఆరెస్సెస్ చీఫ్ మాటలను సంఘపరివార్‌కు శిరోధార్యం కావాలని అన్నారు
