పిఎం-కిసాన్‌కు రైతు ఐడి లింక్‌ తప్పనిసరి

Jan 10,2025 02:02 #Farmer ID link, #mandatory, #PM Kisan
  • కౌలుదార్లకు మోడీ సర్కార్‌ కొత్త చిక్కులు

న్యూఢిల్లీ : అన్నదాతలకు అందించే అరకొరసాయానికి కూడా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కొత్త కొర్రీలు పెడుతోంది. ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పిఎం-కిసాన్‌)కు దరఖాస్తు చేసుకోవాలంటే రైతుకు భూమి ఉన్నట్లుగా రైతు గుర్తింపు ఐడిని తప్పనిసరిగా అనుసంధానం చేయాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ నిబంధనలు విధించింది. ఆంధ్రప్రదేశ్‌ సహా పది రాష్ట్రాలు ఈ నెల 1 నుంచి ఈ నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌తో పాటు అసోం, బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్‌, యూపీ వంటి రాష్ట్రాలున్నాయి. పిఎం-కిసాన్‌ లబ్దిదారులు 11 కోట్ల మంది ఉంటే అందులో 9.25 కోట్ల మంది (అంటే దాదాపు 84 శాతం) ఈ పది రాష్ట్రాల నుంచే ఉండటం గమనార్హం. పిఎం-కిసాన్‌ కోసం ప్రతినెలా దాదాపు రెండు లక్షల మంది కొత్తగా దరఖాస్తు చేస్తుండటంతో ఈ నిబంధన తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. అయితే దీనివల్ల భూయజమానులకే మాత్రమే సాయం అందుతుందని, వాస్తవ సాగుదారులైన కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని రైతు సంఘాల నాయకులు వాపోతున్నారు.

➡️