రూ.570 కోట్ల విలువైన ఎలక్టోరల్‌ బాండ్‌లు విక్రయం

Feb 10,2024 10:43 #Electoral Bonds, #sale
  • ఇదంతా గతనెలలోనే
  • 60 శాతం రూ.1 కోటి డినామినేషన్‌
  • ఆర్టీఐ సమాధానంలో వెల్లడి

న్యూఢిల్లీ : ఈ ఏడాది జనవరి 2 నుంచి 11 వరకు కొనసాగిన ఎలక్టోరల్‌ బాండ్ల విక్రయం తాజా దశలో రూ. 570 కోట్లకు పైగా విలువైన ఎలక్టోరల్‌ బాండ్లు విక్రయించబడ్డాయి. సామాజిక కార్యకర్త కమోడోర్‌ లోకేష్‌ బాత్రా దాఖలు చేసిన సమాచార హక్కు (ఆర్టీఐ) ప్రశ్నకు ఇది సమాధానంగా వెలువడింది. తాజా దశ అమ్మకం అనేది.. గతేడాది నవంబర్‌లో స్కీమ్‌ చెల్లుబాటును సవాలు చేస్తూ సుప్రీంకోర్టు నాలుగు పిటిషన్లను విచారించడం ప్రారంభించినప్పటి నుంచి విక్రయించబడిన రెండో బ్యాచ్‌ ఎలక్టోరల్‌ బాండ్‌లు, 2018లో పథకం ప్రారంభించబడినప్పటి నుంచి విక్రయించబడిన 30వ బ్యాచ్‌ ఎలక్టోరల్‌ బాండ్‌లు. బాత్రా ప్రశ్నకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) ఇచ్చిన సమాధానం ప్రకారం.. బెంగళూరు, చెన్నై, గాంధీనగర్‌, కోల్‌కతా, హైదరాబాద్‌, న్యూఢిల్లీ, విశాఖపట్నం, ముంబయి, జైపూర్‌ ఎస్బీఐ శాఖలలో రూ. 5,71,80,03,000 విలువైన ఎలక్టోరల్‌ బాండ్‌లు విక్రయించబడ్డాయి. రూ. 1,000, రూ. 10,000, రూ. 1 లక్ష మరియు రూ. 1 కోటి విలువ కలిగిన 897 బాండ్‌లలో దాదాపు సగం(415) కోల్‌కతాలో విక్రయించబడ్డాయి. అత్యధికంగా అమ్ముడైన రూ. 1 కోటి విలువ కలిగిన బాండ్‌లు 540 (60 శాతం వరకు) కాగా.. ఇందులో కోల్‌కతా(161), హైదరాబాద్‌ (131), చెన్నై (73)లు ముందు వరుసలో ఉన్నాయి. ఎలక్టోరల్‌ బాండ్‌ విక్రయం తదుపరి దశ ఫిబ్రవరి లేదా మార్చిలో జరుగుతుందని సమాచారం.

➡️