ఆకట్టుకుంటున్న సలీం ప్రచారం

Apr 17,2024 07:38 #2024 elections, #Mohammed Salim
  • ప్రజలతో మమేకమవుతోన్న సిపిఎం అభ్యర్థి
  •  ముర్షీదాబాద్‌లో టిఎంసి, బిజెపికి చెమటలు

ప్రజాశక్తి- న్యూఢిల్లీ ప్రతినిధి : ముర్షిదాబాద్‌… పశ్చిమబెంగాల్‌లో రాజ కీయంగా అత్యంత ప్రతిష్టాత్మక లోక్‌సభ స్థానాల్లో ఒకటి. సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు, రాష్ట్ర కార్యదర్శి మహ్మద్‌ సలీం ఇక్కడ పోటీ చేస్తున్నారు. సలీంకు కాంగ్రెస్‌ మద్దతు ప్రకటించింది. నియోజకవర్గంలో సలీం విస్త్రుత ప్రచారం చేస్తున్నారు. దీంతో టిఎంసి, బిజెపిలకు చెమటలు పడుతున్నాయి. బ్రిటిష్‌ పాలనకు ముందు ముర్షిదాబాద్‌ గ్రేటర్‌ బెంగాల్‌ రాజధాని. బ్రిటిష్‌ వారిని వణికించిన సిరాజ్‌ ఉద్‌ దౌలాతో సహా నవాబులే పాలకులు. అనేక స్మారక కట్టడాలతో కూడిన ఈ చారిత్రక ప్రదేశం మత సామరస్యానికి ప్రతీక. 65 శాతం ముస్లిం మైనారిటీ కమ్యూనిటీలతో, ఈ ప్రాంతం విభిన్నత్వానికి ప్రతిరూపం. మెజారిటీ రైతులే. బీడీ పరిశ్రమకు, హస్తకళలకు ప్రసిద్ధి. ఇది చాలా కాలంగా కమ్యూనిస్టు ఉద్యమానికి బలమైన పునాది. చాలా సార్లు ఇక్కడ కమ్యూనిస్టులు గెలిచారు. తృణమూల్‌ పాలనలో అణచివేతలను తట్టుకుని, సిపిఎం బలంగా పుంజుకుంటోంది. సలీం అభ్యర్థిత్వం అందుకు పెద్ద మేల్కొలుపు.

పుంజుకున్న లెఫ్ట్‌, కాంగ్రెస్‌
విద్వేషపూరిత రాజకీయాలకు ప్రతినిధిగా ఉన్న బిజెపిని, నిరంకుశ తృణమూల్‌ను ఓడించాల్సిన అవసరాన్ని, దేశ మనుగడ కోసం వామపక్ష లౌకిక శక్తులను గెలిపించాల్సిన ఆవశ్కకతను సిపిఎం అభ్యర్థి ఎండి సలీం ప్రజలకు వివరిస్తున్నారు. మహిళలు, యువకులు సిపిఎం సభలకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. 2014 వరకు వరుసగా సిపిఎం గెలిచిన ఈ స్థానాన్ని 2019లో టిఎంసి గెలిచుకుంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇక్కడ ఆ పార్టీదే పైచేయిగా ఉంది. అయితే, 2023లో పంచాయతీ ఎన్నికల్లో తీవ్ర హింసను ఎదుర్కొన్న లెఫ్ట్‌ ఫ్రంట్‌, కాంగ్రెస్‌ బలంగా పుంజుకున్నాయి.

మత సామరస్యానికి ప్రతీక
ముర్షిదాబాద్‌లోని రాణి నగర్‌ సేద్యం పరంగా సారవంతమైనది. వరి, జనపనారతో నిండిన పొలాల్లో ఎక్కడ చూసినా నాగలి దున్నే, ఎరువు చల్లే రైతులే దర్శనమిస్తారు. అరటి, మునగ వంటి పంటలు కనిపిస్తాయి. ఇది రాజకీయంగా కూడా చురుకైన ప్రాంతం. గ్రామాల్లో ఇళ్ల గోడలపై రాజకీయ పార్టీల చిహ్నాలు ఉన్నాయి. సిపిఎం ఎన్నికల గుర్తు సుత్తి, కొడవలి నక్షత్రం ఎక్కువగా గోడలపై కనిపిస్తాయి. ముర్షిదాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ లెఫ్ట్‌ ఫ్రంట్‌ అభ్యర్థి సలీం పర్యటనతో రాణినగర్‌ మొత్తం పండుగ వాతావరణం నెలకొంది. సలీం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు మక్తపాడు గ్రామానికి చేరుకోగా.. మహిళలు, చిన్నారులు సహా వందలాది మంది ప్రజలు ఆయనకు స్వాగతం పలికారు. వారికి కృతజ్ఞతలు తెలిపిన సలీం, సమీపంలోని రెండు మూడు ఇళ్లకు వెళ్లి వద్ధ మహిళలను కలుసుకుని వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ముందుకు సాగిన కాన్వారులో ద్విచక్ర వాహనాలు, ఎలక్ట్రిక్‌ ఆటోలు బారులు తీరాయి. ప్రజలు పూల వర్షం కురిపిస్తూ చేతులు ఊపుతూ సలీంకు శుభాకాంక్షలు తెలిపారు. నిర్దేశిత రిసెప్షన్‌ సెంటర్లతో పాటు, రోడ్లపై బైక్‌పై సలీం గ్రామస్తులను కలుసుకున్నారు. లోక్‌సభ, రాజ్యసభ సభ్యుడిగా మెరిసిన రాష్ట్ర మాజీ మంత్రి సలీం అందరికీ సుపరిచితమే. డివైఎఫ్‌ఐ నాయకుడిగా ఉన్నప్పటి నుంచి ఆయన చేసిన పోరాటాలను ఈ ప్రాంతం కూడా చూసింది. పల్లెల నుంచి పట్టణాలకు చేరుకునే సరికి ఈ యాత్ర పెద్ద ఊరేగింపుగా మారింది. సాంస్క్రుతిక బృందాలతో పాటు, కార్యకర్తలు సైకిళ్లపై, కాలినడకన అనుసరించారు. దారి పొడవునా సలీం ప్రజలు ఎదురేగి స్వాగతాలు పలకడంతో ఆలస్యమైనా ఎక్కడికక్కడ జనం వేచి ఉన్నారు. చిన్న చిన్న ప్రసంగాలలో సలీం టిఎంసి, బిజెపిని ఎండగడుతన్నప్పుడు పెద్ద పెట్టున కరతాళ ధ్వనులు మార్మోగాయి. బెంగాల్‌ నుంచి ఎర్రజెండా జెండాను తరిమికొట్టాలని పిలుపునిచ్చిన వారు అవినీతిలో కూరుకు పోయారని టిఎంసిని సలీం విమర్శించారు.
సిపిఎం, తృణమూల్‌ మధ్యే పోటీ
చిన్న రైతులు, కూలీలు ఎక్కువగా ఉండే ముర్షిదాబాద్‌లో 2014లో సిపిఎంకు చెందిన బదరు దోసాఖాన్‌ విజయం సాధించారు. గత సారి టిఎంసి అభ్యర్థి అబూ తాహిర్‌ ఖాన్‌ గెలిచారు. ఈసారి కూడా తాహిర్‌ ఖాన్‌ టిఎంసి అభ్యర్థి. బిజెపి అభ్యర్థి గౌరీ శంకర్‌ ఘోష్‌. అయితే సిపిఎం, టిఎంసి మధ్యే ప్రధాన పోటీ ఉంది. ముర్షిదాబాద్‌లో 15 లక్షల మంది ఓటర్లతో అత్యధిక ఓటర్లు కలిగిన నియోజకవర్గం. జాతీయోద్యమంలో చారిత్రాత్మక పాత్ర పోషించిన ముర్షీదాబాద్‌, ఎన్నికల్లో లౌకికవాదం పరిక్షణకు, తన పోరాట పటిమను కాపాడుకునేందుకు సిద్ధమవుతోంది.

➡️