- అక్టోబరు 15 -నవంబరు15 మధ్య ప్రచారోద్యమం
- ఇజ్రాయిల్ దుశ్చర్యలకు వ్యతిరేకంగా 7న నిరసన
- సిపిఎం కేంద్ర కమిటీ పిలుపు
ప్రజా సమస్యలపై సిపిఎం సమర భేరి మోగించింది. అధిక ధరలకు వ్యతిరేకంగా అక్టోబరు 15 – నవంబరు 15 మధ్య ప్రతి రాష్ట్రంలో వారం రోజులపాటు ప్రచారోద్యమం నిర్వహించాలని నిర్ణయించింది. జమిలి ఎన్నికల ప్రతిపాదనకు వ్యతిరేకంగా పెద్దయెత్తున ప్రజాభిప్రాయాన్ని కూడగట్టాలని పిలుపునిచ్చింది. సెప్టెంబరు 29, 30 తేదీల్లో ఢిల్లీలో సమావేశమైన సిపిఎం కేంద్ర కమిటీ ఈమేరకు ఒక ప్రకటన విడుదలజేసింది. ఇటీవలి కాలంలో మరణించిన సీతారాం ఏచూరి, బుద్ధదేవ్ భట్టాచార్య, ఇతర నేతలకు ఘనంగా నివాళి ఘటిస్తూ సంతాప తీర్మానాలను కేంద్ర కమిటీ ఆమోదించింది.
పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను తగ్గించాలి
పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను తక్షణమే తగ్గించాలని కేంద్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ నుండి అంతర్జాతీయంగా ముడి చమురు ధర బ్యారెల్‌కు 89.40 డాలర్ల నుండి 73.59 డాలర్లకు పడిపోయింది. అంటే దాదాపు 18శాతం దాకా తగ్గింది. కానీ, మోడీ ప్రభుత్వ ఆదేశాల మేరకు, చమురు ఉత్పత్తి కంపెనీలు దేశీయ రిటైల్ పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించలేదు. పెట్రోల్, డీజిల్ ధరలు అధిక ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోస్తున్నాయి. కూరగాయలు, ఆహార ధాన్యాలు, ఇతర నిత్యావసరాల ధరలు పెరగడానికి హేతువులవుతున్నాయి. ఈ అధిక ధరలకు వ్యతిరేకంగా ప్రచారోద్యమం నిర్వహించాలని కేంద్ర కమిటీ నిర్ణయించింది. పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేసింది.
‘ఒక దేశం, ఒకే ఎన్నిక’ ప్రజాస్వామ్య విరుద్ధం, ఫెడరల్ వ్యతిరేక చర్య
రామ్‌నాథ్ కోవింద్ కమిటీ సిఫార్సుల మేరకు కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోదించిన ఒక దేశం, ఒక ఎన్నిక భావనను కేంద్ర కమిటీ తీవ్రంగా వ్యతిరేకించింది. పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి తీసుకునే చర్యలు పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు, సమాఖ్య వ్యవస్థకు విఘాతం కలిగిస్తాయి. రాష్ట్రాల శాసనసభలకు, లోక్‌సభకు ఐదేళ్ళ కాలపరిమితిని కల్పిస్తున్న రాజ్యాంగ పథకాన్ని ఇది ఉల్లంఘిస్తుంది. రాష్ట్రాల, ఎన్నికైన చట్టసభల హక్కులను నులిమివేసే కేంద్రీకృత, ఏకపక్ష వ్యవస్థను ఇది తీసుకొస్తుంది. ఈ అప్రజాస్వామిక, సమాఖ్య వ్యతిరేక చర్యను నిరసిస్తూ ప్రజాభిప్రాయాన్ని సమీకరించాలని కేంద్ర కమిటీ నిర్ణయించింది.
దిగజారుతున్న మణిపూర్ పరిస్థితి
మణిపూర్‌లో పరిస్థితి మరింతగా దిగజారుతుండడం పట్ల కేంద్ర కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. లోయ, కొండ ప్రాంత జిల్లాల సరిహద్దుల్లోని ప్రాంతాలపై దాడులు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. మౌలికమైన సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యాయి. ఈ పరిస్థితి ఘర్షణలకు దారి తీస్తోంది. జాతుల విభజన మరింత ముదిరే పరిస్థితులకు ఇది దారితీస్తోంది. మణిపూర్ పట్ల కేంద్రం తన బాధ్యతను విడనాడిందనేది అత్యంత స్పష్టంగా కనిపిస్తోంది. గత 16 మాసాల్లో ఒక్కసారి కూడా ప్రధాని నరేంద్ర మోడీ మణిపూర్‌లో పర్యటించకపోవడమనే వాస్తవం దీనికి బలం చేకూరుస్తోంది. సమస్యను పరిష్కరించడానికి అవసరమైన రాజకీయ చర్చలు, పరిష్కారాలకు అనువైన పరిస్థితులు సృష్టించే దిశగా తీసుకోవాల్సిన మొదటి చర్య ముఖ్యమంత్రి బీరేన్ సింగ్‌ను తొలగించడమని సిపిఎం పునరుద్ఘాటిస్తోంది.
అన్ని కమ్యూనిటీల ప్రజల హక్కులకు హామీ కల్పించడంతో పాటు శాంతి, సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు అనువైన పరిస్థితిని సృష్టించేందుకు కేంద్ర ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకుని, ప్రధాన జాతుల గ్రూపులతో రాజకీయ చర్చల ప్రక్రియను ప్రారంభించాలి.
పశ్చిమ బెంగాల్‌లోని ప్రజా ఉద్యమానికి మద్దతు
ఆర్‌జికార్ ఆస్పత్రిలో పని చేస్తున్న జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం, హత్యను నిరసిస్తూ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న ప్రజా ఉద్యమానికి కేంద్ర కమిటీ పూర్తి మద్దతు ప్రకటించింది. రాష్ట్రంలోని ఆరోగ్య రంగంతో సహా అన్ని రంగాల్లో రాజ్యమేలుతున్న పాలక పార్టీ-క్రిమినల్ సంబంధాలకు వ్యతిరేకంగా కూడా ఈ ప్రజా ఉద్యమం కొనసాగుతున్నది.
వైద్య సిబ్బంది భద్రత, రక్షణ కోసం పార్లమెంట్‌లో ఒక చట్టాన్ని తీసుకురావాలని దేశవ్యాప్తంగా మెడికల్ సిబ్బంది చేస్తున్న డిమాండ్‌కు సిపిఎం మద్దతిస్తోంది.
పలు ఇతర రాష్ట్రాల్లో మహిళలు, బాలికలపై పెరుగుతున్న నేరాల పట్ల కూడా కేంద్ర కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
నిర్మలా సీతారామన్‌పై కేసు
ఎన్నికల బాండ్ల పథకం ద్వారా విరాళాలను బలవంతంగా రాబట్టుకున్నారంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, తదితరులపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని బెంగళూరులోని ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేయడాన్ని కేంద్ర కమిటీ గమనంలోకి తీసుకుంది. ఈ కేసును సక్రమంగా దర్యాప్తు చేయాలని, ఇందుకు సంబంధించి ఆర్థిక మంత్రిని ఇంటరాగేట్ చేయాలని పార్టీ డిమాండ్ చేసింది.
సమ్మె పోరాటాలకు మద్దతు
తమిళనాడులోని కాంచీపురంలో సమ్మె చేస్తున్న శాంసంగ్ కార్మికులకు కేంద్ర కమిటీ పూర్తి మద్దతు ప్రకటించింది. యూనియన్ ఏర్పాటు చేసుకోవడానికి గల హక్కును వినియోగించుకోవడానికే కార్మికులు సమ్మె చేస్తున్నారు. అయితే కార్మికులు యూనియన్ ఏర్పాటు చేసుకోవడానికి అనుమతించేది లేదంటూ శాంసంగ్ భీష్మించుక్కూర్చొంది. ఇప్పటివరకు యూనియన్ నమోదుకు కార్మిక శాఖ కూడా అనుమతించకపోవడం దురదృష్టకరం.
వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకుని, యూనియన్ రిజిస్టర్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వానికి కేంద్ర కమిటీ విజ్ఞప్తి చేసింది.
సెప్టెంబరు 28 నుండి నిరవధిక సమ్మెకు దిగిన ఫెర్రో స్క్రాప్ నిగమ్ లిమిటెడ్ (ఎఫ్‌ఎస్‌ఎన్‌ఎల్) కార్మికులకు కేంద్ర కమిటీ సంఘీభావం తెలిపింది. లాభాలు ఆర్జిస్తున్న మినీ రత్న కంపెనీ ఎఫ్‌ఎస్‌ఎన్‌ఎల్‌ను ప్రైవేటీకరించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ కార్మికులు సమ్మెకు దిగారు. జపాన్ బహుళ జాతి కంపెనీకి ఈ కంపెనీని విక్రయిచాలన్నది ప్రభుత్వ ఆలోచనగా వుంది. దేశంలో కీలకమైన ఉక్కు పరిశ్రమలో ఎఫ్‌ఎస్‌ఎన్‌ఎల్ భాగమైనందున ఇది స్వీయ ఓటమి చర్యగా వుంది.
ఇజ్రాయిల్‌కు దారుణమైన మద్దతు
పాలస్తీనియన్ల ప్రయోజనాలకు మద్దతునిస్తూ భారత్ దీర్ఘకాలంగా అనుసరిస్తూ వచ్చిన విధానాన్ని మోడీ ప్రభుత్వం విడనాడింది. ఆక్రమిత భూభాగాల నుండి 12 మాసాల్లోగా ఇజ్రాయిల్ వైదొలగాలని కోరుతూ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో తీర్మానం పెట్టి దానిపై ఓటింగ్ జరిపితే భారత్ ఓటు వేయకుండా గైర్హాజరైంది.
భారత్‌లో తయారయ్యే ఆయుధాలు, పేలుడు పదార్ధాలను ఇజ్రాయిల్‌కు ఎగుమతి చేయడానికి ప్రభుత్వం అనుమతిస్తోంది. ఈ ఆయుధాలను గాజాలో ఇజ్రాయిల్ సాయుధ బలగాలు ఉపయోగిస్తున్నాయి. ఇజ్రాయిల్‌కు ఆయుధాల ఎగుమతులపై తక్షణమే నిషేధం విధించాలని కేంద్ర కమిటీ డిమాండ్ చేస్తోంది.
ప్రచారోద్యమం పిలుపులు
గాజాలో పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్ ఊచకోతకు పాల్పడి అక్టోబరు 7కి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఆ రోజును నిరసన దినంగా పాటించాలని వామపక్షాలు పిలుపునిచ్చాయి. పార్టీ శాఖలన్నీ ఆ రోజున నిరసన దినం పాటించాలని కేంద్ర కమిటీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది.
1. జమిలి ఎన్నికల ప్రతిపాదనను వ్యతిరేకించాలి.
2. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా,అలాగే పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను తగ్గించాలి.
3. నిరుద్యోగం, మౌలిక సేవల ప్రైవేటీకరణను వ్యతిరేకించాలి.
4. మహిళలపై, బాలికలపై లైంగిక దాడులు, నేరాలను అణచివేసేందుకు చర్యలు చేపట్టాలి.
అక్టోబరు 15 నుండి నవంబరు 15 వరకు ప్రతి రాష్ట్రంలో వారం పొడవునా ప్రచారోద్యమం నిర్వహించాలని కేంద్ర కమిటీ నిర్ణయించింది.