- పోలీస్ తూటాలకు ముగ్గురు ముస్లిం యువకులు బలి
- మసీదు సర్వే హింసాత్మకం.. నిరసనలపై ఉక్కుపాదం
లక్నో : ఉత్తర ప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలోని షాహి జామా మసీదులో సర్వే హింసాత్మకంగా మారింది. సర్వేను తీవ్రంగా వ్యతిరేకిస్తూ స్థానికులు పెద్ద ఎత్తున గుమిగూడారు. నిరసనకారులపై పోలీసులు ప్లాస్టిక్ బుల్లెట్లు ప్రయోగించడంతో ముగ్గురు ముస్లిం యువకులు ప్రాణాలు కోల్పోయారు. మొరాదాబాద్ డివిజనల్ కమిషనర్ అనన్య కుమార్ మాట్లాడుతూ, కాల్పుల్లో చనివపోయినవారిని నయీమ్, బిలాల్, నిమన్‌లుగా గుర్తించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులకు కూడా కొందరికి గాయాలయ్యాయని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు మహిళలతో సహా 15 మందిని అదుపులోకి తీసుకకున్నామన్నారు.. జమా మసీదు హరిహర ఆలయమని, ఆ ఆలయాన్ని కూల్చేసి మసీదు నిర్మించారని రిషి రాజ్ గిరి అనే వ్యక్తి పిటిషన్ వేయడం, జిల్లా కోర్టు వెంటనే దీనిపై సర్వేకు ఆడ్వకేట్ కమిషన్ నియమించి, వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించడం చకచకా జరిగిపోయాయి. అంతే స్పీడుతో అడ్వకేట్ కమిషన్ కూడా మసీదులో సర్వే చేపట్టడం ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆదివారం ఉదయం సర్వేకు వచ్చిన వారిని స్థానిక ముస్లిం యువకులు అభ్యంతరం తెలపడంతో పోలీసులు వెంటనే రంగ ప్రవేశం చేసి నిరసనకారులపై నిర్బంధాన్ని ప్రయోగించారు. దీంతో ఘర్షణలు చెలరేగాయి. మసీదులోకి అధికారులు రాకుండా అడ్డుకున్నారంటూ ముస్లిం యువకులపై పోలీసులు ప్లాస్టిక్ బులెట్లు ప్రయోగించారు. ఈ హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశంపై పై కోర్టులో అప్పీలు చేసుకునే అవకాశం కూడా లేకుండా సర్వేకు చర్యలు చేపట్టడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.కొందరు దుండగులు పోలీసుల పైకి రాళ్లు విసిరారనీ, దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావటానికి పోలీసులు కొంత వరకు బల ప్రయోగం చేశారని జిల్లా ఎస్‌పి కృష్ణ కుమార్ విష్ణోరు తెలిపారు. రాళ్లు విసిరినవారినీ, ప్రేరేపించినవారిని గుర్తించామనీ.. వారిపై చర్యలుంటాయని చెప్పారు. అక్కడ పరిస్థితి అదుపులోనే ఉన్నదని సంభాల్ ఘటనపై యుపి డిజిపి ప్రశాంత్ కుమార్, జిల్లా మేజిస్ట్రేటు రాజేంద్ర పేసియా చెప్పారు. సర్వే నివేదికను ఈనెల 29న న్యాయస్థానానికి అందించనున్నట్టు సమాచారం.
ఎన్నికల్లో అవకతవకల నుంచి దృష్టి మరల్చేందుకే బిజెపి హింస : అఖిలేష్‌యాదవ్ విమర్శ
తాజా ఘటనపై ఉత్తర ప్రదేశ్‌లోని ప్రధాన ప్రతిపక్షం సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) చీఫ్ అఖిలేశ్ యాదవ్ స్పందించారు. ఎన్నికల్లో అవకతవకల ఆరోపణల నుంచి దృష్టి మళ్లించేందుకే బిజెపి ఈ హింసను ప్రేరేపించిందని ఆయన విమర్శించారు. ఎన్నికల గురించి చర్చ జరగకుండా అంతరాయాన్ని కలిగించేందుకు ఉద్దేశపూర్వకంగానే సర్వే టీమ్‌ను ఆదివారం ఉదయం అక్కడికి పంపించారని పేర్కొన్నారు. ఈ మేరకు సంభాల్ ఘటనకు సంబంధించిన ఒక వీడియోను ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. బిజెపి ఈ ఆరోపణలను తోసిపుచ్చింది.