లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలోని షాహి జమా మసీదులో సర్వేపై చెలరేగిన హింసాకాండలో మృతుల సంఖ్య ఐదుకి చేరింది. మొర్దాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మరో ఇద్దరు మరణించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మృతులను మొహమ్మద్ కైఫ్, మొహహ్మద్ అయాన్‌లుగా గుర్తించారు.
సంభాల్ జిల్లాలో ప్రభుత్వం నిషేదాజ్ఞలు విధించింది. నవంబర్ 30 వరకు బయటి వ్యక్తులు జిల్లాలోకి ప్రవేశించకూడదని పేర్కొంది. ‘‘ సంబంధిత అధికారి అనుమతి లేకుండా బయటి వ్యక్తులు, ఇతర సామాజిక సంస్థలు, ప్రజా ప్రతినిధులు జిల్లా సరిహద్దులోకి ప్రవేశించకూడదు ”అని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే BNS సెక్షన్ 223 కింద శిక్షార్హులు అవుతారని తెలిపింది.
జమా మసీదు హరిహర ఆలయమని, ఈ ఆలయాన్ని కూల్చివేసి మసీదు నిర్మించారని రిషిరాజ్ గిరి అనే వ్యక్తి వేసిన పిటిషన్‌పై జిల్లా కోర్టు సర్వేకు ఆదేశించింది. ఆదివారం ఉదయం సర్వేకు వచ్చిన అధికారులను స్థానిక ముస్లిం యువకులు అభ్యంతరం తెలపడంతో పోలీసులు వెంటనే రంగ ప్రవేశం చేసి నిరసనకారులపై నిర్బంధాన్ని ప్రయోగించారు. దీంతో ఘర్షణలు చెలరేగాయి. మసీదులోకి అధికారులు రాకుండా అడ్డుకున్నారంటూ ముస్లిం యువకులపై పోలీసులు ప్లాస్టిక్ బులెట్లు ప్రయోగించారు. ఈ హింసాత్మక ఘటనలో ఆదివారం ముగ్గురు ముస్లిం యువకులు మరణించిన సంగతి తెలిసిందే.