Sambhal Violence : సమాజ్‌వాది పార్టీ ఎంపిపై కేసు నమోదు

లక్నో : సంభాల్‌ హింసాకాండపై సమాజ్‌వాది పార్టీ ఎంపి జియా ఉర్‌ రెహ్మన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ హింసాకాండలో ఎంపి రెహ్మాన్‌తో పాటు స్థానిక ఎమ్మెల్యే ఇక్బాల్‌ మహమూద్‌ కుమారుడు సోహైల్‌ ఇక్బాల్‌ కూడా ఉన్నట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. మరో 800 మంది గుర్తుతెలియని పేర్లను కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. ప్రైవేట్‌ ఆస్తుల ధ్వంసంతో పాటు చట్టవిరుద్ధంగా సమావేశమవడం, ప్రభుత్వ అధికారులపై దాడి, ఇతరుల ప్రాణాలకు హాని కలిగించే చర్యలు, మతసామరస్యాన్ని దెబ్బతీయడం వంటి సెక్షన్‌లను ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
హింస జరగడానికి రెండు గంటల ముందు రెహ్మాన్‌ నమాజ్‌ కోసం మసీదుకు వెళ్లి రెచ్చగొట్టే ప్రకటనలు చేశాడని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం జనాలను రెచ్చగొట్టి మత సామరస్యాన్ని దెబ్బ తీసినట్లు ఆరోపించారు.
సర్వేను అడ్డుకోవద్దని పోలీసులు అక్కడ గుమిగూడిన వారిని కోరారని, వారంతా నినాదాలు చేస్తూ రాళ్లు రువ్వారని, పోలీసు వాహనాలు, ప్రైవేట్‌ ఆస్తులను ధ్వంసం చేశారని ఎఫ్‌ఐఆర్‌ పేర్కొన్నారు. అనేక దుకాణాలకు నిప్పు పెట్టారని, హత్య చేయాలనే ఉద్దేశ్యంతో సర్కిల్‌ ఆఫీసర్‌ అనుజ్‌ కుమార్‌ చౌదరిపై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడని, అధికారి కుడి కాలికి బుల్లెట్‌ గాయమైందని పేర్కొన్నారు.
షాహీ జామా మసీదుపై సర్వే చేపట్టాలంటూ కోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో హింసాకాండ చెలరేగిన సంగతి తెలిసిందే. సర్వే అధికారులను అడ్డుకున్న ఆందోళనకారులపై పోలీసులు టియర్‌ గ్యాస్‌, కాల్పులు జరిపారు. ఈ హింసాత్మక ఘటనలో నలుగురు మరణించగా, పలువురు గాయపడ్డారు.

➡️