- నేడు శక్తికాంతదాస్ పదవీ విరమణ
న్యూఢిల్లీ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) నూతన గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శిగా పని చేస్తున్నారు. ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్ పదవీ కాలం మంగళవారంతో ముగియనుంది. శక్తికాంత 2018లో ఆర్‌బిఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీ కాలం 2021లోనే ముగియగా, మోడీ ప్రభుత్వం మరో మూడేళ్లు పొడిగించింది. ప్రధాని మోడీకి అప్తమిత్రుడిగా గుర్తింపు పొందిన దాస్ పదవీకాలం నేటితో ముగియడంతో కేబినెట్ నియామకాల కమిటీ నూతన గవర్నర్‌గా మల్హోత్రాను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. 1990 బ్యాచ్ రాజస్థాన్ కేడర్‌కు చెందిన మల్హోత్రా ఆర్‌బిఐకి 26వ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నెల 11 నుంచి మూడేళ్ల కాలం పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఐఐటి కాన్పూర్‌లో కంప్యూటర్ సైన్స్‌లో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అమెరికా ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ చేశారు. మైన్స్, పన్నులు, ఆర్థిక, విద్యుత్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి రంగాల్లో మూడు దశాబ్దాలకు పైగా సర్వీసు అనుభవం కలిగి ఉన్నారు. ప్రస్తుతం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని రెవెన్యూ విభాగం సెక్రటరీగా ఉన్న మల్హోత్రా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఆర్థికపర, పన్నుల విషయంలో అనుభవం కలిగి ఉన్నారు.