స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ : సంజయ్ రౌత్‌

Jan 11,2025 14:29

ముంబయి : లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని ఓడించాలనే లక్ష్యంతోనే ఇండియా బ్లాక్‌ ఏర్పడింది. కాంగ్రెస్‌తో ప్రాంతీయ పార్టీలు కలిసి పోటీ చేసి కొంతమేర విజయం సాధించాయి. ఆ తర్వాత జరిగిన కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదేవిధమైన పార్టీల ఉమ్మడి కృషి కొనసాగింది. అయితే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా మహా వికాస్‌ అఘాడీ ఘోరంగా పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో శివసేన (యుబిటి) స్థానిక ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించుకుంది. ఆ పార్టీ అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే ఆ విధమైన సూచనలు చేశారని ఆ పార్టీ సీనియర్‌ నేత సంజయ్ రౌత్‌ శనివారం వెల్లడించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘కూటమిలో ఉమ్మడిగానే పోటీ ఉంటుంది. వ్యక్తిగతంగా ఆ పార్టీ కార్యకర్తలకు అవకాశాలు రావు. ఇది సంస్థాగత వృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. అందుకే శివసేన (యుబిటి) స్థానిక సంస్థల్లో ఒంటరిగానే పోటీ చేస్తుంది. ముంబయి, థానే, నాగపూర్‌, ఇతర మున్సిపల్‌ కార్పొరేషన్‌లు, జిల్లా పరిషత్‌లు, పంచాయతీల ఎన్నికల్లో మా బలంతో పోటీ చేస్తాం’ అని సంజరురౌత్‌ అన్నారు.

 

➡️