న్యూఢిల్లీ : కోల్‌కతా హైకోర్టు జడ్జి జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీ సుప్రీంకోర్టు జడ్జీగా బాధ్యతలు చేపట్టనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) జస్టిస్ సంజీవ్ ఖన్నా, ఇరత జడ్జీల సమక్షంలో సోమవారం ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. బాగ్చీ బాధ్యతల స్వీకరణతో.. సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య 33కి చేరుకోనుంది. రాజ్యంగం నిర్దేశించిన పరిమితి ప్రకారం సుప్రీంకోర్టులో గరిష్టంగా 34 మంది జడ్జీలు ఉండవచ్చు.
1966 అక్టోబర్ మూడున జన్మించిన బాగ్చీ సుప్రీంకోర్టులో ఆరేళ్లపాటు జడ్జిగా కొనసాగనున్నారు. ఈ కాలంలోనే పదోన్నతి పొంది సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తిగానూ సేవలందించే అవకాశముంది. జస్టిస్ కేవీ విశ్వనాథన్ 2031 మే 25వ తేదీన రిటైర్ అయ్యాక జస్టిస్ బాగ్చీ సిజెఐగా సేవలందించే వీలుంది.
2011 జూన్ 27న బాగ్చి కోల్‌కత్తా హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. తర్వాత 2021 జనవరి నాలుగోతేదీన ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీఅయ్యారు. అదే ఏడాది నవంబర్ 8న తిరిగి కోల్‌కత్తా హైకోర్టుకు బదిలీ అయ్యారు. అప్పటి నుండి అదే హైకోర్టులో సేవలందిస్తున్నారు. కోల్‌కత్తా హైకోర్టులో మొత్తంగా 13 ఏళ్లు పలు రకాల కేసులకు సంబంధించిన కీలక తీర్పులు వెలువర్చారు.