- ఛత్తీస్‌గఢ్‌లో చేతులు మారిన రూ.350 కోట్లు
- సిబిఐ దర్యాప్తునకు ప్రతిపక్షాల డిమాండ్
రాయ్ పూర్ : కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న భారత్‌మాల రోడ్డు ప్రాజెక్టుల్లో భారీ అవినీతి చోటుచేసుకున్నట్లు ఛత్తీస్‌గఢ్‌లో తీవ్ర దుమారం చెలరేగుతోంది. రాష్ట్రంలో చేపట్టిన ఈ ప్రాజెక్టుల్లో సేకరించిన భూములకు గాను రైతులకు అందజేసే పరిహార నిధుల్లో రూ.350 కోట్ల మేర గోల్‌మాల్ జరిగినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)తో దర్యాప్తునకు ఆదేశించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. భారత్‌మాల కింద ప్రాజెక్టులకు ఛత్తీస్‌గఢ్‌లో భూములిచ్చిన రైతులకు నష్టపరిహారంగా చెల్లించిన నిధుల్లో రూ.350 కోట్ల మేరకు నిధులు దుర్వినియోగమయ్యాయని రాష్ట్ర ప్రతిపక్ష నేత చరణ్‌దాస్ మహంత్ తెలిపారు. దీనిపై సిబిఐతో దర్యాప్తు జరిపించాలని ఆయన బుధవారం అసెంబ్లీలో డిమాండ్ చేశారు. ఇందుకు బాధ్యులైన అధికారులు క్రిమినల్ అభియోగాలు ఎదుర్కొనాలని డిమాండ్ చేశారు. కాగా దీనిపై సిబిఐ దర్యాప్తుకు లేదా ఎంఎల్‌ఎల కమిటీతో విచారణకు ప్రభుత్వం తిరస్కరించడంతో కాంగ్రెస్ ఎంఎల్‌ఎ వాకౌట్ చేశారు. ఇప్పటివరకు రారుపూర్-విశాఖపట్నం ఆర్థిక కారిడార్‌కు భూమి సేకరణలో రూ.43.18కోట్లు దుర్వినియోగమవడానికి దారి తీసిన నిర్లక్ష్యానికి కారకులైన సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డిఎం), ఇతర అధికారులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన భరత్‌మాలా ప్రాజెక్టులో ఈ హైవే భాగంగా వుంది. ప్రశ్నోత్తరాల సమయంలో మహంత్ ఈ విషయాన్ని లేవదీస్తూ, కేవలం నాలుగు గ్రామాల పరిధిలోని నష్టపరిహారం గురించే తాను ప్రశ్నించానని, అదే రూ.43కోట్లు వుంటే ఇక మిగిలిన రహదారులను పరిగణనలోకి తీసుకుంటే అప్పుడు రూ.350కోట్ల మేరకు అదనపు చెల్లింపులు జరిగాయని రెవిన్యూ మంత్రి కూడా అంగీకరించారన్నారు. కేంద్రానికి సంబంధించిన ఈ వ్యవహారంలో ప్రధాన పార్టీల నేతల ప్రమేయం కూడా వుండే అవకాశం వున్నందున సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలన్నారు. దానిపై మంత్రి స్పందిస్తూ, బాధ్యులైన వారిని సస్పెండ్ చేశామన్నారు. దర్యాప్తు సాగుతోందన్నారు. అన్ని ఫిర్యాదులపై కూలంకషంగా విచారణ జరుగుతుందని చెప్పారు.