లౌకికవాదం, సామాజిక న్యాయమే మా సిద్ధాంతం

Oct 28,2024 00:04 #Tamil actor Vijay, #Vijay Party

తొలి సభలో సినీ హీరో విజయ్
చెన్నై : విభజన రాజకీయాలకు, అవినీతి శక్తులకు వ్యతిరేకంగా పోరాడతామని ప్రముఖ తమిళ సినీ హీరో, టివికె పార్టీ అధ్యక్షుడు జోసఫ్‌ విజయ్ చంద్రశేఖర్‌ ప్రకటించారు. బిజెపి నిరంకుశత్వంతో వ్యవహరిస్తోందని విమర్శించారు. తమ ప్రధాన సైద్ధాంతిక ప్రత్యర్థి బిజెపి అని, దాని తర్వాత రాష్ట్రంలో డిఎంకె అని స్పష్టం చేశారు. ‘మేము సమానంగా పుట్టామని మా ప్రాథమిక నమ్మకం. అది ఎవరికి వ్యతిరేకంగా ఉంటుందో నేను చెప్పాల్సిన అవసరం ఉందా? విభజన వాక్చాతుర్యంతో (బిజెపి) ఈ దేశాన్ని నాశనం చేస్తున్న వారు మనకు సైద్ధాంతిక శత్రువులు, తన స్వప్రయోజనాల కోసం మాత్రమే శ్రద్ధ వహించే కుటుంబం ‘ద్రావిడ మోడల్‌’ అంటూ ప్రచారం చేస్తూ పెరియార్‌, అన్నాదురై పేర్లను దుర్వినియోగం చేస్తూ ప్రజలను దోపిడీ చేస్తున్న వారు మనకు రాజకీయ శత్రువులు’ అని అన్నారు. విల్లుపురం సమీపంలో నిర్వహించిన తమిళగ వెట్రి కళగం (టివికె) పార్టీ మొదటి మహానాడులో విజరు సుదీర్ఘ ప్రసంగం చేశారు. ”నాకు రాజకీయ అనుభవం లేకపోవచ్చు. కానీ, నేను పాలిటిక్స్‌ విషయంలో భయపడడం లేదు” అని అన్నారు. సినీ రంగంతో పోలిస్తే రాజకీయ రంగం చాలా సీరియస్‌ అని పేర్కొన్నారు. ”ద్రవిడ, తమిళ జాతీయవాద సిద్ధాంతాలను అనుసరిస్తాం. తమిళనాడు గడ్డకు ఇవి రెండు కళ్లులాంటివి. లౌకికవాదం, సామాజిక న్యాయమే మా భావజాలం. వాటి ఆధారంగానే పని చేస్తాం. పెరియార్‌ ఇవి రామస్వామి, కె.కామరాజ్‌, బాబాసాహెబ్‌ అంబేద్కర్‌, వేలు నాచియార్‌, అంజలి అమ్మాళ్‌ ఆశయాలతో పార్టీని ముందుకు తీసుకెళ్తాం. రాజకీయాల్లో ఫెయిల్యూర్స్‌, సక్సెస్‌ స్టోరీలు చదివాక.. నేను నా కెరీర్‌ని పీక్‌లో వదిలేసి మీ అందరిపై అచంచలమైన విశ్వాసాన్ని ఉంచి మీ విజయ్ గా ఇక్కడ నిలబడ్డా. రాజకీయ అనుభవం లేదంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ అమితమైన ఆత్మవిశ్వాసంతో మనం సర్పం (రాజకీయం)తో ఆడుకునే పిల్లల్లాంటివాళ్లం” అని అన్నారు. తన రాజకీయ ప్రయాణంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. అరియలూరులో నీట్‌ విద్యార్థిని అనిత ఆత్మహత్య ఉదంతాన్ని గుర్తు చేస్తూ నీట్‌పై తమ పార్టీ వ్యతిరేక వైఖరిని ఈ సందర్భంగా ప్రకటించారు. ‘సినిమా కెరీర్‌లో అత్యున్నత స్థాయిని వదిలేసి ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చా. నేను సినిమాల్లోకి వచ్చినప్పుడు కూడా నన్ను అవమానించారు. అయినా, కఠోర శ్రమ, ధైర్యంతో ఈ స్థాయికి చేరుకున్నా. ఎంజిఆర్‌, ఎన్‌టిఆర్‌ సైతం ఇదే విధమైన విమర్శలను ఎదుర్కొన్నారు. కానీ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో వారు ప్రభంజనం సృష్టించారు. ప్రతి ఓటు ఎంతో శక్తిమంతమైనది.. మా పార్టీ తమిళనాడు రాజకీయాలపై బలమైన ప్రభావం చూపుతుంది” అని అన్నారు. ”రాబోయే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మమ్మల్ని పూర్తిస్థాయి మెజార్టీతో గెలిపిస్తారని పూర్తిగా విశ్వసిస్తున్నాం. ఒకవేళ ఏవైనా పార్టీలు పొత్తు పెట్టుకోవాలనుకుంటే.. వారికి అధికారంలో భాగస్వాముల్ని చేస్తాం” అన్నారు.
సభా వేదికపై ఆ పార్టీ నేత ప్రొఫెసర్‌ సంపత్‌ కుమార్‌ మాట్లాడుతూ.. తమిళగ వెట్రి కళగం పార్టీ సిద్ధాంతాలు, విధానాలను వివరించారు.. ”పుట్టుకతోనే మనుషులంతా సమానం. సమ సమాజాన్ని సష్టించడమే పార్టీ లక్ష్యం. దీంతో పాటు సెక్యులరిజం, రాష్ట్ర స్వయంప్రతిపత్తి, సమ్మిళిత అభివృద్ధి, ద్విభాషా విధానం, అవినీతిపై పోరాటం, తిరోగమన ఆలోచనల తిరస్కరణ, డ్రగ్స్‌ రహిత తమిళనాడు వంటివి ప్రధాన అంశాలు”గా పేర్కొన్నారు. అనంతరం మరో నేత కేథరిన్‌ మాట్లాడారు.

➡️