- పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్షాల ఆందోళన
- అదానీ ముడుపుల వ్యవహారంపై జెపిసికి పట్టు
- కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుపై ప్రివిలేజ్ నోటీస్
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ‘దేశాన్ని అమ్మనీయం'(దేశ్ బిక్నే నహి దేంగే) అంటూ ప్రతిపక్ష పార్టీల ఎంపిల నినాదాలతో గురువారం పార్లమెంట్ ఆవరణ దద్దరిల్లింది. అదానీ ముడుపుల వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి) విచారణ కోసం పట్టుబడుతూ ఇండియా బ్లాక్ పార్టీలు గురువారం వినూత్నంగా ఆందోళన చేపట్టారు. ‘దేశ్ బిక్నే నహి దేంగే’ అని హిందీలో ఒక్కో అక్షరంతో రాసిన ఉన్న ఒక్కో ప్లకార్డుతో ఆందోళన చేపట్టారు. సభకు వెళ్లే ప్రధాన గేటు మకర ద్వారం, సంసద్ భవన్ (ఓల్డ్ పార్లమెంట్ భవనం) ముందు ప్రతిపక్ష ఎంపిలంతా మానవహారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ, అదానీకి వ్యతిరేకంగా నినాదాల హోరెత్తించారు. ఈ ఆందోళనలో కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, శివసేన, డిఎంకె, ఎన్‌సిపి, ఆప్, కేరళ కాంగ్రెస్, జెఎంఎం, ఐయుఎంఎల్ తదితర పార్టీల ఎంపిలు పాల్గొన్నారు. అదానీ ముడుపుల వ్యవహారంపై జెపిసితో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు సుముఖంగా లేని కేంద్ర ప్రభుత్వం, ప్రజల దృష్టి మరల్చేలా వ్యవహరిస్తుందని, ఉభయ సభలను ఉద్దేశపూర్వకంగానే వాయిదా వేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉభయ సభల్లోనూ ఆందోళన
గురువారం కూడా పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పర్వం తొక్కాయి. సభలు ప్రారంభమైన క్షణం నుంచే అధికార, ప్రతిపక్ష ఎంపిలు ఆందోళనలతో గందరగోళం నెలకొంది. దీంతో లోక్‌సభను మధ్యాహ్నం ఒంటి గంట వరకు వాయిదా వేశారు. ఆ తరువాత మరోసారి మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. అమెరికా వ్యాపారవేత్త జార్జ్ సోరస్‌తో కాంగ్రెస్ పార్టీకి సంబంధాలు ఉన్నట్లు బిజెపి ఆరోపించగా, అదానీ అంశంపై చర్చ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఇరు వైపుల సభ్యుల నినాదాలతో సభ హౌరెత్తింది. ప్రశ్నోత్తరాల సమయం పూర్తి అయిన తరువాత, జీరో అవర్‌లో ప్రతిష్టంభన మొదలైంది. కాంగ్రెస్ ఎంపి జ్యోతిమణి మాట్లాడుతూ.. ఓ వ్యాపారవేత్తకు, బిజెపికి సంబంధాలు ఉన్నట్లు ఆరోపించారు. అయితే ఆ వ్యాపారవేత్త పేరును రికార్డుల్లో చేర్చడం లేదని స్పీకర్ చైర్‌లో ఉన్న జగదంబికా పాల్ తెలిపారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు ఆందోళన ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ఎంపి కె.సి వేణుగోపాల్ మాట్లాడుతూ ఎటువంటి నిబంధన లేకుండానే జీరో అవర్‌లో కేంద్ర మంత్రి పియూష్ గోయల్ జోక్యం చేసుకుని కాంగ్రెస్ నేతలను విమర్శించారని, అయినా వాటిని రికార్డుల్లో ఉంచారని అని గుర్తు చేశారు. ప్రతిపక్ష సభ్యులు నిబంధన ప్రకారమే మాట్లాడితే, ఆ వ్యాఖ్యలను తొలగిస్తున్నారని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. పక్షపాత ధోరణి పనికి రాదని, అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరించడం తగదని విమర్శించారు. ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. కాంగ్రెస్ నేతలకు, జార్జ్ సోరస్‌కు లింకులు ఉన్నట్లు బిజెపి నేత నిశికాంత్ దూబే ఆరోపించారు. దేశాన్ని నిర్వీర్యం చేసేందుకు సోరస్, కాంగ్రెస్ కలిసి పనిచేస్తోందని విమర్శించారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లారు. బిజెపికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మరోవైపు రాజ్యసభలో ఇదే తంతు నడిచింది. అధికార, ప్రతిపక్షాలు ఆందోళనల నడుమ సభ వాయిదాల పర్వం తొక్కింది. గురువారం ప్రారంభమైన సభలో కేంద్ర మంత్రి, సభా నాయకుడు జెపి నడ్డా మాట్లాడుతూ ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. సభకు తరచూ అంతరాయం ఏర్పడుతుందని, అందుకు ప్రతిపక్షమే కారణమని విమర్శించారు. దీంతో ప్రతిపక్షాలు కూడా ఆందోళనకు దిగాయి. మరోవైపు నడ్డా మాట్లాడిన తరువాత ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడేందుకు ప్రయత్నించారు. కానీ అవకాశం ఇవ్వకుండా మద్యాహ్నం 2 గంటలకు సభను వాయిదా వేశారు. అనంతరం ప్రారంభమైన సభలో కూడా గందరగోళం నెలకొనడంతో సభను శుక్రవారానికి వాయిదా వేశారు.
కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుపై ప్రివిలేజ్ నోటీస్
కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుపై ప్రతిపక్ష ఎంపిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు తాము అనర్హులమన్న ఆయన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుకు వ్యతిరేకంగా ప్రివిలేజ్ మోషన్ నోటీసు ఇచ్చారు. ప్రతిపక్షాలకు చెందిన సుమారు 60 మంది ఎంపిలు సభా హక్కుల తీర్మానానికి మద్దతు తెలిపారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బుధవారం రాజ్యసభలో మాట్లాడుతూ ప్రతిపక్ష సభ్యులను విమర్శించారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధంఖర్‌పై ప్రతిపక్షాల విమర్శలను వ్యతిరేకించారు. ఈ సందర్భంగా ‘మీరు కుర్చీని గౌరవించలేకపోతే, ఈ సభలో సభ్యులుగా ఉండే హక్కు మీకు లేదు’ అని ప్రతిపక్ష సభ్యులను ఉద్దేశించి అన్నారు. దీనిపై టిఎంసి ఎంపి సాగరికా ఘోష్ దీనిపై స్పందించారు. ప్రతిపక్ష ఎంపిలు రాజ్యసభలో ఉండేందుకు అనర్హులన్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుపై ప్రివిలేజ్ మోషన్ నోటీసు ఇచ్చామన్నారు. ఈ తీర్మానంపై 60 మంది ప్రతిపక్ష ఎంపిలు సంతకం చేసినట్లు తెలిపారు. మరోవైపు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సభను సజావుగా నడపడానికి కృషి చేయడం లేదని, దీనికి బదులు ప్రతిపక్షాలను పదేపదే అవమానించడాన్ని ఆయన ఎంచుకున్నారని సాగరికా ఘోష్ విమర్శించారు. ‘ప్రతిపక్ష సభ్యులను రిజిజు అవమానించారు. పార్లమెంటు లోపల, బయట వ్యక్తిగత పదాలు ఉపయోగించారు. ఆయన ఉన్నత పదవికి ఇది తగనిది. తన పదవిని ఆయన పూర్తిగా దుర్వినియోగం చేయడమే’ అని ఆమె అన్నారు.