- రూ.450కే గ్యాస్, రూ.15 లక్షల బీమా, మహిళలకు రూ.2500
- ఇండియా బ్లాక్ మేనిఫెస్టో విడుదల
రాంచీ : జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మంగళవారం ఇండియా వేదిక తన మేనిఫెస్టోను విడుదల చేసింది. రూ.450కే గ్యాస్ సిలిండర్, రూ.15 లక్షల వరకూ హెల్త్ కవర్, మహిళలకు నెలకు రూ.2,500, ఏడు కిలోలకు రేషన్ బియ్యం పెంపుదలతో సహా మొత్తం ఏడు హామీలను ఇచ్చింది. మేనిఫెస్టోను ఇండియా వేదికలోని పార్టీలు కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, జెఎంఎం నాయకులు, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, సిపిఎం, ఆర్‌జెడి నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ ‘మేం ఏ హామీల గురించి మాట్లాడినా వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమర్శలు గుప్పిస్తారు. మోడీ రాష్ట్రానికి వచ్చి నా పేరు చెప్పి కాంగ్రెస్ హామీలకు విశ్వసనీయత లేదని విమర్శిస్తారు. కాంగ్రెస్ తన హామీలను నెరవేరుస్తుంది. మోడీ హామీలు ఎప్పటికీ నెరవేరవు’ అని అన్నారు. 81 స్థానాలు ఉన్న జార్ఖండ్ అసెంబ్లీకు ఈ నెల 13, 20 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. ఈ నెల 23 ఫలితాలను వెల్లడించనున్నారు.
సోరెన్ హెలికాఫ్టర్ టేకాఫ్‌కు అనుమతిలో జాప్యం
రాష్ట్రపతి జోక్యం కోరిన జెఎంఎం
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ టేకాఫ్‌కు అనుమతి ఇవ్వడంలో దాదాపు గంటన్నరపాటు జాప్యం చేయడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జోక్యం చేసుకోవాలని జెఎంఎం విజ్ఞప్తి చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన కారణంగానే ఈ జాప్యం జరిగిందని, అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెనర్ల భద్రతకు, గౌరవానికి హామీ ఇవ్వాలని కోరింది. ఈ మేరకు రాష్ట్రపతికి లేఖ రాసింది. సోమవారం రాష్ట్రంలోని గర్హా, చైబసల్లో మోడీ పర్యటన సందర్భంగా నో-ఫ్లై జోన్ అమలు చేశారని తెలిపింది. ‘సిమ్‌డేగలోని బజార్ టండ్‌లో సోమవారం మధ్యాహ్నం 2:25 గంటలకు బహిరంగ సభకు జెఎంఎం స్టార్ క్యాంపైనర్ హేమంత్ సోరెన్ హజరుకావాల్సి ఉంది. ఈ సభకు ఇసి కూడా అనుమతించింది. ఇక్కడకు 90 కిలోమీటర్ల దూరంలోని చైబసలో మోడీ పర్యటన కారణంగా సోరెన్ హెలికాఫ్టర్ టేకాఫ్‌కు గంటన్నర పాటు అనుమతి ఇవ్వలేదు’ అని లేఖలో జెఎంఎం పేర్కొంది. ఎన్నికల కమిషన్ నియమాల ప్రకారమే భద్రతా కారణాల దృష్టా నో-ఫ్లై జోన్‌ను 50 కిలోమీటర్ల రేడియస్‌లో కేవలం 15 నిమిషాలపాటు మాత్రమే అమలు చేయాలని గుర్తు చేసింది.