28మంది మావోయిస్టులు కాల్చివేత
దంతెవాడ : వరుస ‘ఎన్‌కౌంటర్ల’తో రక్తమోడుతున్న ఛత్తీస్‌గఢ్‌లో తాజాగా మరో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. శుక్రవారం దంతెవాడ, నారాయణ్‌పూర్ అంతర్ జిల్లా సరిహద్దుల్లోని అంబుజ్‌మాడ్‌లో చోటుచేసుకున్న ఈ ఎన్‌కౌంటర్‌లో 28 మంది మావోయిస్టులను కాల్చిపారేశారు. ఏప్రిల్ 16న కేంకర్ జిల్లాలో 29 మంది మావోయిస్టులు మరణించిన ఎన్‌కౌంటర్ తర్వాత భద్రతా దళాలు సాగించిన రెండవ అతి పెద్ద ఎన్‌కౌంటర్ ఇది. అంబుజ్‌మాడ్ ఎన్‌కౌంటర్ రాత్రి పొద్దుపోయేవరకు కొనసాగినట్లు బస్తర్ పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు 28 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా దళాలు తెలిపాయి. మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచారం అందడంతో దంతెవాడ, నారాయణ్‌పూర్ పోలీసులు, భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఎన్‌కౌంటర్‌లో భద్రతా సిబ్బంది అంతా క్షేమంగానే వున్నారని దంతెవాడ ఎస్‌పి గౌరవ్ రాయ్ తెలిపారు.
తాజా సంఘటనలో నక్సల్స్ నుండి ఆటోమేటిక్ ఆయుధాలను, విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. తుల్‌తులి, నెందరూర్ గ్రామాల మధ్య గల అడవుల్లో శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఎన్‌కౌంటర్ మొదలైందని ఆయన తెలిపారు.. జిల్లా రిజర్వ్ గార్డ్ (డిఆర్‌జి), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టిఎఫ్)కి చెందిన సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారని గౌరవ్ రారు తెలిపారు. మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ సరిహద్దుల్లో 6,000 చ. కి. మీ మేర విస్తరించి ఉన్న దట్టమైన ఈ అటవీ ప్రాంతం మావోయిస్టుల కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది.
2026 మార్చి కల్లా దేశంలో నక్సలిజాన్ని తుడిచేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హూంకరించారు. గత నెల 3న దంతెవాడ-బీజాపూర్ సరిహద్దు పొడవునా గల అడవుల్లో చోటు చేసుకున్న ఎన్‌కౌంటర్‌లో 9మంది నక్సల్స్ మరణించారు. ఆగస్టు 29న నారాయణ్ పూర్‌లోని దట్టమైన అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మహిళా నక్సల్స్ మరణించారు. అప్పుడు కూడా పెద్ద మొత్తంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 16నాటి ఎన్‌కౌంటర్‌లో 29మంది మావోయిస్టులు మృతి చెందారు. దీంతో ఈ ఏడాది ఇప్పటివరకు 187మంది మావోయిస్టులను భద్రతా బలగాలు కాల్చిచంపాయి. వీటిలో చాలా వరకు బూటకపు ఎన్‌కౌంటర్లేనని హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు.
