రాష్ట్రపతి ముర్ముకు మళ్లీ అవమానం

Apr 1,2024 08:49 #President Murmu, #Shame

– అద్వానీకి భారతరత్న ప్రదానం సందర్భంగా ఘటన
– ప్రధాని మోడీ తీరుపై సర్వత్రా ఆగ్రహం
న్యూఢిల్లీ : దేశ ప్రథమ పౌరులు అయిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మరోమారు అవమానించింది. బిజెపి సీనియర్‌ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌కె అద్వానీకి భారతరత్న పురస్కారాన్ని అందజేసేందుకు రాష్ట్రపతి ఆయన నివాసానికి వెళ్లారు.
ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆయన రాష్ట్రపతి భవన్‌కు రాలేరని భావించి స్వయంగా ద్రౌపది ముర్ముయే ఆదివారం అద్వానీ నివాసానికి వెళ్లి పురస్కారం ప్రదానం చేశారు. ఈ సమయంలో ఆరోగ్యం సహకరించనందున అద్వానీ కుర్చీలో ఆసీనులైవున్నారు. ఆయన పక్కనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూర్చున్నారు. అయితే అద్వానీకి రాష్ట్రపతి ముర్ము పురస్కారాన్ని ప్రదానం చేస్తున్న సందర్భంలో కానీ, ఆ తర్వాత కానీ ప్రధాని మోడీ కుర్చీలో నుంచి లేచి నిలబడలేదు. రాష్ట్రపతి ముర్ము నిల్చుని ఉన్నా కూడా ఆయన కుర్చీలోనే కూర్చొనివున్నారు. రాష్ట్రపతి ముర్ము నిలబడి ఉండగా అద్వానీ, మోడీ కుర్చీల్లో కూర్చున్న చిత్రాలను రాష్ట్రపతి కార్యాలయం కూడా సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. దేశ ప్రథమ పౌరురాలైన రాష్ట్రపతిని నిల్చని ఉండగా ప్రధాని మోడీ కుర్చీలో కూర్చోవడమంటే రాష్ట్రపతి పదవితో పాటు గిరిజనులను, మహిళలను అవమానించడమేనని సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
రాష్ట్రపతి భవన్‌ ప్రొటోకాల్‌ ప్రకారం ఆరోగ్యం సహకరించనివారే కుర్చీలో కూర్చొని అవార్డును స్వీకరించవచ్చునని మాజీ రాష్ట్రపతి కోవింద్‌కు మీడియా కార్యదర్శిగా పనిచేసిన అశోక్‌ మాలిక్‌ తెలిపారు. అయితే ఈ కార్యక్రమం రాష్ట్రపతి భవన్‌లో జరగడం లేదని, అద్వానీ నివాసంలో జరిగిందని ఆయన పేర్కొన్నారు. అవార్డు ప్రదానం సమయంలోనే కాకుండా ఆ తర్వాత కూడా ముర్ము నిలబడి వుండగా..మోడీ కుర్చీలోనే కూర్చొని ఉండటం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది.
ఉద్దేశ్యపూర్వకంగానే అవమానించారు : కాంగ్రెస్‌
రాష్ట్రపతి ముర్ము గిరిజన మహిళ అయినందున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆమెను ఉద్దేశపూర్వకంగానే అవమానించారని కాంగ్రెస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ప్రధాని మోడీ మరోమారు గిరిజన మహిళ అయిన రాష్ట్రపతి ముర్మును అవమానించారు. ఇది తొలిసారి కాదు. కొత్త పార్లమెంటు భవన సముదాయాన్ని ప్రారంభించినప్పుడు రాష్ట్రపతిని ఆహ్వానించకుండా అవమానించారు. అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ట సమయంలోనూ రాష్ట్రపతిని పట్టించుకోలేదు. ప్రధాని మోడీ, బిజెపి మనస్తత్వమే మహిళలకు, దళితులకు, ఆదివాసీలకు వ్యతరేకమైన పదేపదే పునరావృతమైన ఈ అవమానకర ఘటనలు తేల్చిచెబుతున్నాయి’ అని కాంగ్రెస్‌ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది.
కనీస గౌరవం తెలియదా? : తేజస్వీయాదవ్‌
నిత్యం సంప్రదాయాలు, సుద్దులు గురించి బిజెపి నేతలకు కనీస గౌరవ మర్యాదలు కూడా తెలియడం లేదని ఆర్‌జెడి నేత తేజస్వీ యాదవ్‌ ఎద్దేవా చేశారు. ‘రాష్ట్రపతి నిల్చనివుంటే కనీసం లేచి నిలబడి గౌరవం ఇవ్వాలన్న సంగతి కూడా ప్రధాని మోడీకి తెలియదా?’ అని ఆయన ప్రశ్నించారు.

➡️