ముంబయి : ఎన్నికల్లో ఇక ముందు తాను పోటీచేయకపోవచ్చని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి – శరద్ పవార్) అధ్యక్షుడు శరద్ పవార్ అన్నారు. మంగళవారం బారామతిలో ఆయన మాట్లాడారు. ‘నేను అధికారంలో లేను. రాజ్యసభలో ఏడాదిన్నర పదవీకాలం మిగిలి ఉంది. భవిష్యత్‌లో నేను ఎన్నికల్లో పోటీ చేయను. ఎక్కడో ఒకచోట ఆగిపోవాల్సి వస్తుంది” అని పవార్ అన్నారు. తన రాజ్యసభ పదవీకాలం 18 నెలల్లో ముగియనుందని, అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. 1999లో ఎన్‌సిపిని స్థాపించిన పవార్ మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. తనను 14 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపి గెలిపించిన బారామతి ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. నవంబర్ 20న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌సిపి (ఎస్‌పి) తరపున యుగేంద్రపవార్ తన పెదనాన్న అజిత్‌పవార్‌తో తలపడనున్నారు. తన మనవడు యుగేంద్ర పవార్ తరపున శరద్ పవార్ ప్రచారం చేస్తున్నారు. ‘అజిత్‌పవార్‌పై నాకు ఎలాంటి పగలేదు. ఇప్పుడు యువ, డైనమిక్ నాయకత్వాన్ని సిద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైంది’ అని పవర్ అన్నారు.