ముంబై : మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు రాజకీయ విశ్లేషకులను సైతం గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఇక ఈ ఎన్నికల్లో మహాయతి కూటమితో తలపడిన మహా వికాస్ అఘాడీ ఊహించని ఫలితాలతో షాక్‌లో ఉంది. ప్రత్యేకించి ఇవిఎంలలో పోలైన ఓట్లపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. తాజాగా ఈ విషయంపై మహా వికాస్ అఘాడీ కూటమిలో భాగస్వామ్య పార్టీ అయిన ఎన్‌సిపి (శరద్‌పవార్) చీఫ్ శరద్ పవార్ స్పందించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈవిఎంలలో పోలైన ఓట్లలో తేడాలున్నాయి. కానీ వాటికి ఆధారాలు లేవు అని ఆయన అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎన్నికల్లో ఇవిఎంలలో పోలైన ఓట్లలో కొంత తేడా ఉంది. కానీ ప్రస్తుతం నా వద్ద దీనికి సంబంధించిన ఆధారాలు లేవు. ఈ ఓట్లపై కొంతమంది రీకౌంటింగ్ జరపమని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఏది సాధ్యమైదే అది చేస్తాం. ఏం జరుగుతుందో చూద్దాం. కానీ రీకౌంటింగ్‌పై నాకు పెద్దగా ఆసక్తి లేదు’ అని ఆయన అన్నారు.
కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేశాయి. పార్లమెంటు సమావేశాల్లో ప్రతిరోజు 11 గంటలకు ప్రతిపక్ష నేతలు అక్కడ ప్రశ్నలు లేవనెత్తుతారు. కానీ ప్రతిపక్ష నేతల అభిప్రాయాలు, డిమాండ్లను పార్లమెంటులో ఆమోదించడం లేదు. అంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని సరిగ్గా అనుసరించడం లేదనే అర్థం అని పవార్ అన్నారు. అధికారపక్షం ఇలా చేయడం సరికాదు. దీనికోసం ప్రజల్లోకి వెళ్లి అవగాహన కల్పించాలని పవార్ అన్నారు.