- పారిశ్రామిక ప్రాంతాల్లో కొత్త పద్ధతి
- పర్యాటక ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ
- నాలెడ్జ్‌లో తెలుగు పిల్లలు నెంబర్‌వన్‌గా ఉండాలి
- కలెక్టర్ల సమావేశంలో సిఎం
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : పరిశ్రమలకు అవసరమైన భూములు ఇచ్చే విషయంలో రైతులను భాగస్వామ్యం చేసి సేకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. వారిని భాగస్వామ్యం చేయడం ద్వారా ఇండిస్టియల్ పార్కులను వారే అభివృద్ధి చేసుకుంటారని తెలిపారు. ఇదే అమలయితే ప్రస్తుతం ఉన్న భూసేకరణ చట్టం చెట్టెక్కిపోయే ప్రమాదము ఉంది. వెలగపూడి సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల సమావేశం రెండోరోజు పలు అంశాలపై చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు. పర్యాటకం, రాజధాని అమరావతి, రెవెన్యూ, విద్య, విద్యుత్, పరిశ్రమలు, ఐటిపార్కులు వంటి కీలక అంశాలపై రెండో రోజు చర్చ జరిగింది. తొలుత అన్ని విభాగాల అధికారుల నుండి సమాచారం తీసుకోవడంతోపాటు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పారిశ్రామిక పాలసీలపై ఆయన మాట్లాడుతూ భూసేకరణలో రైతులే నేరుగా భాగస్వామ్యం అయ్యేలా చూడాలని ఆదేశించారు. వారంతా ముందుకొచ్చి ఇండిస్టియల్ పార్కును అభివృద్ధి చేసుకుంటామంటే ప్రోత్సహించాలని సూచించారు. సేకరించాల్సి వచ్చిన సమయంలో వారిని భాగస్వామ్యం చేయడం మంచి ఫలితాలు ఇస్తుందని తెలిపారు. పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయడంలో జాప్యం చేయొద్దని సూచించారు. ఈ విషయంలో కలెక్టర్లు కీలకంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ఐటి పార్కుల కోసం భూములు సేకరించాలని సూచించారు. కడపలోని కొప్పర్తిలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని, తిరుపతిలోనూ 500 ఎకరాల అవసరం ఉందని సూచించారు. డ్రోన్ మారిటైమ్ పాలసీకి కేంద్రం ప్రశంసలు అందించిందని, పోర్టుల నిర్మాణం కీలకమని, ఈ విషయంలో ఎవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని సిఎం ఆదేశించారు. రామాయపట్నం, కృష్ణపట్నం, మచిలీపట్నం, కాకినాడ గేట్‌వే పోర్టు, మూలపేట పోర్టులు అత్యంత కీలకమైనవని తెలిపారు.
పాఠశాల విద్యమీద సమీక్ష నిర్వహించారు. డ్రాపవుట్లపై సిఎం అధికారులను ప్రశ్నించారు. భోజన మెనూ విషయంలో లోటు రాకూడదని పేర్కొన్నారు. నాలెడ్డ్ విషయంలో తెలుగు పిల్లలు నెంబర్‌వన్‌గా ఉండాలని తెలిపారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం ఉండాలని, భవిష్యత్‌కు అనుగుణంగా కరిక్యులమ్ మార్చాలని పేర్కొన్నారు. ఎడ్యుకేషన్, స్కిల్, ఎంప్లాయిమెంట్ మధ్య బ్యాలెన్స్ ఉండాలని, ఒకేషన్ మీద ఫోకస్ పెట్టాలని తెలిపారు. తహశీల్దార్లు వారి డిజిటల్ లాకర్లను ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి ఇస్తున్నారని, ఇక ముందు ఇలా ఇస్తే కఠిన చర్యలు ఉంటాయని, ఆర్‌పి సిసోడియా చెప్పగా, దీనిపై సిఎం స్పందిస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యాన్ని, అక్రమాలను సహించేది లేదని స్పష్టం చేశారు. అలాగే ఎక్సైజ్ అమ్మకాలు డిజిటల్ చేయకుండా నిర్వహించడంపై సిఐడి విచారణ జరుగుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం నాణ్యమైన మద్యం సరఫరా చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇసుక విషయంలోనూ అవకతవకలు జరిగాయని పేర్కొన్నారు. గంజాయి, మత్తుపదార్థాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గత ఆరునెలలుగా రాష్ట్రంలో నేరాలు తగ్గాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సిసిటివి సర్వేలెన్స్ ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని, వాటిని మరింత మెరుగుదల చేయాలని సూచించారు. దీనిపై డిజిపి ద్వారకా తిరుమలరావు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్బంగా పలువురు అధికారులు చెప్పిన వివరాలపై సిఎం కొంత అసహనం వ్యక్తం చేశారు. తొలిరోజు చెప్పినా రెండోరోజు కూడా అస్పష్ట వివరాలతో వచ్చారని, మరోసారి ఇలాంటి సమస్య పునరావృతం కాకూడదని చెప్పారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై యాక్షన్ టేకెన్ రిపోర్టులోనూ స్పష్టత లేకుండా ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండురోజులపాటు జరిగిన కలెక్టర్ల సమావేశంలో కీలకంగా పరిపాలనలో ఆదాయాన్ని ఎలా రాబట్టాలనే అంశాలపైనే ఎక్కువగా దృష్టి సారించారు. ముఖ్యంగా పారిశ్రామిక రంగాలకు భూములు కేటాయించడంపై ప్రధాన దృష్టి సారించారు. టూరిజం ప్రమోషన్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.
భాగస్వామ్య భూసేకరణ అంటే
ప్రస్తుతం పరిశ్రమలకు భూములు ఇవ్వాలంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారం సేకరించి ఇవ్వాల్సి ఉంది. వీటిని తుంగలో తొక్కుతూ గత ప్రభుత్వాలు నెగోషియేషన్ పాలసీని తీసుకొచ్చాయి. దీనిలో కలెక్టర్లు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ భూములు తీసుకునే విధంగా ప్రత్యేక అధికారాలు కల్పించింది. రైతులు తమ భూములకు నిర్ణయించిన ధరను చర్చల ద్వారా పరిష్కరించుకునే అవకాశం కల్పించారు. అది కూడా 2013 భూసేకరణ చట్టానికి విరుద్ధమే. ఇప్పుడు ప్రభుత్వంతో పనిలేకుండా రైతులే నేరుగా పారిశ్రామిక ప్రాంతాలు ఏర్పాటు చేసుకునేలా చూడాలని నిర్ణయించారు. అంటే నెగోషియేషన్ పాలసీకి కూడా తూట్లు పొడిచారు. ఫలానా చోట పారిశ్రామికవేత్త భూమి కావాలంటే కలెక్టర్ సూచన మేరకు అక్కడ పారిశ్రామిక ప్రాంతం ఏర్పాటుకు ప్రకటన ఇచ్చి, రైతులనే అక్కడ దానికి వీలుగా వారి భూములను స్వచ్ఛందంగా ఇస్తున్నట్లు ఒప్పందం చేసుకునేలా నిబంధనలు రూపొందిస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైన వ్యవహారమని భూసేకరణ అధికారి ఒకరు తెలిపారు.