న్యూఢిల్లీ : ఆదాయ పన్ను నుండి మినహాయింపు ప్రయోజనం పొందాలంటే ముందు ఆదాయం ఉండాలని కాంగ్రెస్ ఎంపి శశిథరూర్ పేర్కొన్నారు. నిరుద్యోగం గురించి ఆర్థికమంత్రి బడ్జెట్‌లో ప్రస్తావించలేదని అన్నారు. శనివారం లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ సమర్పించిన కేంద్ర బడ్జెట్‌పై ఆయన పై విధంగా స్పందించారు.
మధ్యతరగతి ప్రజలకు పన్ను నుండి ఊరట అంటూ బిజెపి పార్లమెంటులో హర్షధ్వానాలు వ్యక్తం చేసింది. అయితే మీరు జీతం పొందితేనే పన్ను మినహాయింపు వర్తిస్తుంది. కానీ అసలు ఆదాయం లేకుండా పన్ను మినహాయింపు ఎందుకని కేంద్రాన్ని నిలదీశారు. ఉద్యోగాలు లేకుండా ఆదాయం ఎక్కడి నుండి వస్తుందని ప్రశ్నించారు. బడ్జెట్‌లో నిరుద్యోగం గురించి ప్రస్తావనే లేదని దుయ్యబట్టారు.
ఒకే దేశం, ఒకే ఎన్నిక అంటూ ఊదరగొడుతున్న పాలక ఎన్‌డిఎ పార్టీ వాస్తవానికి ఒక్కో రాష్ట్రంలో ఎన్నికలను మరిన్ని ఉచితాలను ఇచ్చేందుకు వినియోగించడం విడ్డూరం అని అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో బీహార్‌పై వరాల జల్లు కురిపించడంపై పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు.