షిండేశకం ముగిసింది.. ఎప్పటికీ సిఎం కాలేరు : సంజయ్ రౌత్‌

ముంబయి :  మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏకనాథ్‌ షిండేపై శివసేన (యుబిటి) నేత సంజయ్ రౌత్‌ గురువారం విరుచుకుపడ్డారు. షిండే శకం ముగిసిందని, ఆయన మళ్లీ ఇక ఎప్పటికీ  ముఖ్యమంత్రి కాలేరని ఎద్దేవా చేశారు. మహాయుతి కూటమి బుధవారం  దేవేంద్ర ఫడ్నవీస్‌ను తదుపరి ముఖ్యమంత్రిగా, షిండేను ఉప ముఖ్యమంత్రిగా ప్రకటన విడుదల చేసిన  తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

షిండేను బిజెపి పావులా వాడుకుందని, ఇప్పుడు పక్కకు విసిరేసిందని సంజయ్ రౌత్‌ ఎద్దేవా చేశారు. షిండే శకం ముగిసిపోయి రెండేళ్లు అయ్యిందని, ఇప్పుడిక ఆయన అవసరం బిజెపికి లేదని అన్నారు. షిండే మళ్లీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేరని చెప్పారు. అవసరసమైతే షిండే పార్టీని కూడా బిజెపి విచ్ఛిన్నం చేయగలదని.. ఇది ప్రధాని మోడీ రాజకీయ పంధా అని అన్నారు. స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ.. 15 రోజులైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయారు. అంటే వారి కూటమిలో ఏదో లోపం ఉందని అర్థమౌతుందని అన్నారు. ఇవాళ కాకపోతే తర్వాతైనా బయటికి వస్తుందని చెప్పుకొచ్చారు.

➡️