- వారి హెలికాప్టర్లు ఏనాడైనా తనిఖీ చేశారా ?
- ఇసికి శివసేన ఎంపి సంజరు రౌత్ ప్రశ్నల వర్షం
ముంబయి : ఎన్నికల కమిషన్ కొందరు నాయకులపై పక్షపాతం చూపిస్తోందని శివసేన (యుబిటి) ఎంపి సంజరు రౌత్ విమర్శించారు. సోమవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శివసేన (యుబిటి) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే బ్యాగును ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ స్పందిస్తూ దేశంలోని అగ్ర రాజకీయ నాయకులకు సంబంధించిన హెలికాప్టర్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆ క్రమంలోనే ఠాక్రే బ్యాగును పరిశీలించినట్లు సమర్థించుకున్నారు. సిఐసి స్పందనపై సంజరు రౌత్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇవే నిబంధనలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇతర కాషాయ పార్టీ అధినేతల విషయంలో ఏనాడైనా అమల్జేశారా? అని ప్రశ్నించారు. మోడీ, అమిత్ షా హెలికాఫ్టర్లను ఎప్పుడైనా తనిఖీ చేశారా? అని నిలదీశారు. తనిఖీ విధానాల్లో ఇసి పక్షపాత ధోరణి చూపిస్తోందని, ఇకనైనా పక్షపాత రహితంగా సోదాలు వ్యవహరించాలని కోరారు. యుబిటి నాయకులు ఇళ్లు, బ్యాగులు, హోటళ్లు, హెలికాప్టర్లను మాత్రమే ఇసి అధికారులు తనిఖీ చేస్తున్నారని, అధికార కాషాయ కూటమికి చెందిన ప్రముఖ నాయకులకు సంబంధించిన విమానాల్లో సోదాలు చేయట్లేదని తెలిపారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో ఒడిషాలో ప్రధాని మోడీ హెలికాప్టర్‌ను తనిఖీ చేసిన వ్యక్తిని సస్పెండ్ చేశారని..ఎన్నికల సంఘం పాటించే నిష్పాక్షిక న్యాయం ఇదేనా? అని నిలదీశారు. ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్‌కు ప్రయాణించిన హెలికాప్టర్లను కూడా ఇసి అధికారులు తనిఖీ చేయడం లేదని తెలిపారు. బిజెపి నేతలు ఒక్కొ నియోజకవర్గానికి రూ.20-25 కోట్లు చొప్పున తరలించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న డబ్బు పంపిణీ ఇసి అధికారులకు కనిపించట్లేదా? అని సంజరు నిలదీశారు.