RG Kar: న్యాయం చేయండి

ఆర్‌జి కర్‌ మెడికో జయంతి సందర్భంగా కొల్‌కతా, ఉత్తర 24 పరగణా జిల్లాల్లో ర్యాలీలు

కొల్‌కతా : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్‌జి కర్‌ ఆసుప్రతి హత్యాచారం ఘటన బాధితురాలికి న్యాయం జరగాలనే డిమాండ్‌తో ఆదివారం కొల్‌కతాలో భారీ మౌన ర్యాలీ నిర్వహించారు. బాధితురాలి తొలి జయంతి సందర్భంగా ‘అభరు మంచ్‌’ బ్యానర్‌ కింద నిర్వహించిన ఈ ర్యాలీలో వైద్యులు, వైద్య సిబ్బందితో పాటు సాధారణ ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గన్నారు. కొల్‌కతా యూనివర్శిటీ క్యాంపస్‌కు సమీపంలోని కాలేజ్‌ స్వేర్‌ వద్ద నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ఉత్తర కొల్‌కతాలోని ప్రభుత్వ ఆసుపత్రి వరకూ జరిగింది. అక్కడ భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో ర్యాలీ ముగిసింది. ర్యాలీ కారణంగా ఆసుపత్రి వద్ద పశ్చిమ బెంగాల్‌ పోలీసులతో పాటు సెంట్రల్‌ ఇండిస్టియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సిఐఎస్‌ఎఫ్‌) సిబ్బంది పెద్ద సంఖ్యలో మోహరించారు. సుప్రీంకోర్టు ఆదేశాల తరువాత ఆసుపత్రి వద్ద సిఐఎస్‌ఎఫ్‌ భద్రతను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం ర్యాలీలో పాల్గనవారు నోటికి నల్లటి బట్టలు కట్టుకుని, బాధితురాలికి న్యాయం చేయాలని ఉన్న ప్లకార్డులు చేతితో పట్టుకున్నారు.
కాగా, బాధితురాలి జయంతి సందర్భంగా నార్త్‌ 24 పరగణాస్‌ జిల్లాలో ఆదివారం మరొక ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బాధితురాలి తల్లిదండ్రులు కూడా పాల్గన్నారు. ఈ కేసులో సిబిఐ దర్యాప్తుతో తాము సంతృప్తి చెందడం లేదని తల్లిదండ్రులు పేర్కొన్నారు. అలాగే, ఇదే జిల్లాలో బాధితురాలి జ్ఞాపకార్థం ప్రత్యేక ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

➡️