ఓటింగ్‌ డేటా వెల్లడికి నిరాకరించడం ఎన్నికల ప్రక్రియనే ప్రశ్నార్థకం చేస్తుంది : సీతారాం ఏచూరి

May 17,2024 08:53 #Sitaram Yechury
  •  ఎందుకు విడుదల చేయడం లేదో అర్థం కావడం లేదు : మాజీ సిఇసి ఖురేషి

కోల్‌కతా : నిజమైన ఓటింగ్‌ వివరాలను వెల్లడించడానికి ఎన్నికల సంఘం నిరాకరించడం మొత్తం ఎన్నికల ప్రక్రియనే ప్రశ్నార్థకం చేస్తుందని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. గురువారం మధ్యాహ్నం ఇక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ ‘తుది గుణాంకాలను ఇసి విడుదల చేయకపోవడం అవకతవకలకు ఆస్కారమిచ్చేదిగా ఉంది. మొత్తం ఎన్నికల ప్రక్రియనే ప్రశ్నార్థకం చేస్తుంది’ అని అన్నారు. ‘ఎన్నికల కమిషన్‌ అనేది చట్టబద్ధమైన రాజ్యాంగ సంస్థ. ఎన్నికలు జరుగుతున్నప్పుడు కోర్టులు కూడా జోక్యం చేసుకోవు’ అని సీతారాం ఏచూరి తెలిపారు. మిగిలిన ప్రతిపక్షాల మాదిరిగానే సిపిఎం కూడా తన తదుపరి చర్యలపై కసరత్తు చేస్తోందని చెప్పారు. ‘మేం చట్టపరమైన అవకాశాల కోసం అన్వేషిస్తున్నాం. అలాగే, ప్రజా ఒత్తిడిని కొనసాగించే పద్ధతిని కూడా కొనసాగిస్తున్నాం’ అని చెప్పారు.
మొదటి మూడు దశల్లోనూ ఓటింగ్‌ పూర్తయిన తరువాత ఎన్నికల సంఘం విలేకరుల సమావేశం నిర్వహించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ గత శనివారం ప్రెస్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఉమెన్స్‌ ప్రెస్‌ కార్ఫ్స్‌, ది ప్రెస్‌ అసోసియేషన్‌, ఫారిన్‌ కరస్పాండెంట్స్‌ క్లబ్‌ అధ్యక్షులు ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు లేఖ రాశారు. ‘2019 ఎన్నికల వరకూ కూడా ప్రతి దశలోనూ ఓటింగ్‌ తరువాత విలేకరుల సమావేశం నిర్వహించడం సాధారణ పద్ధతి. ‘ప్రజాస్వామ్యం అతిపెద్ద పండుగ’గా పరిగణించబడే సార్వత్రిక ఎన్నికల ఓటింగ్‌ రోజున ఏమి జరిగిందో తెలుసుకునే హక్కు పౌరులకు ఉంది’ అని లేఖలో పేర్కొన్నారు.
ఇసి ఎందుకు సమాచారం విడుదల చేయలేదో అర్థం కావడం లేదు : మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఖరేషి
పూర్తి సమాచారాన్ని ఎన్నికల సంఘం ఎందుకు విడుదల చేయలేదో అర్థం కావడం లేదని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ వై.ఎస్‌. ఖురేషి అన్నారు. ‘పూర్తి సమాచారాన్ని ఇసి ఎందుకు విడుదల చేయలేదో నాకు అర్థం కావడం లేదు. ఇలాంటి ఫిర్యాదు గతంలో వచ్చినట్లు నాకు గుర్తు లేదు’ అని ఖురేషీ తెలిపారు. పోలింగ్‌ శాతం విడుదల్లో జాప్యంపై సీతారాం ఏచూరితోపాటు ప్రతిపక్ష నాయకులు మల్లిఖార్జున ఖర్గే, ముఖ్యమంత్రులు అరవింద్‌ కేజ్రీవాల్‌్‌, మమతా బెనర్జీ తదితరులు ఆందోళన వ్యక్తం చేశారు. జాప్యాన్ని ప్రశ్నించారు.
రూల్‌బుక్‌ ప్రకారం, ప్రతీ పోలింగ్‌ స్టేషన్‌లోని ప్రిసైడింగ్‌ అధికారి తప్పనిసరిగా పోలింగ్‌ ముగిసే సమయానికి పోలైన మొత్తం ఓట్లను కంపైల్‌ చేసి దానిని ఫారమ్‌ 17 అని పిలవబడే పేపర్‌లో నమోదు చేయాలి. ఈ ఫారమ్‌ కాపీలు రాజకీయ పార్టీల ప్రతినిధులకు, రిటర్నింగ్‌ ఆఫీసర్‌కు అందజేయాలి. అదే రోజు లేదా మరుసటి రోజున అన్ని పోలింగ్‌ స్టేషన్ల నుండి డేటాను క్రోడీకరించి, తుది పోలింగ్‌ని పూర్తి సంఖ్యలో ఇసికి ఇవ్వడం రిటర్నింగ్‌ అధికారి బాధ్యత.
ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ప్రతిపక్షాలు భయపడేందుకు అనేక కారణాలున్నాయి. మొదటి దశ పోలింగ్‌ ఏప్రిల్‌ 19న నిర్వహించగా, రెండో దశ ఏప్రిల్‌ 26న జరిగింది. మొదటి దశ పోలింగ్‌ ముగిసిన 11 రోజుల తర్వాత అంటే, ఏప్రిల్‌ 30న ఇసి తుది ఓటింగ్‌ శాతాన్ని విడుదల చేసింది. ప్రాథమిక పోలింగ్‌ శాతం కంటే తుది పోలింగ్‌ శాతం గణనీయంగా పెరిగింది. ఇలాంటి అంశాలు ప్రతిపక్షాలను అందోళనపరుస్తున్నాయి. మరోవైపు తుది పోలింగ్‌ను వెల్లడించడంలో జాప్యాన్ని వ్యతిరేకిస్తూ ఎడిఆర్‌ ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటీషన్‌ వేసింది. ఇది వచ్చే వారంలో విచారణకు వచ్చే అవకాశం ఉంది.

➡️