- 12 మంది మృతి
- మహారాష్ట్రలో ఘోరం
- మంటల గురించి వ్యాపించిన పుకార్లే కారణమా?
జలగావ్: మహారాష్ట్రలోని జల్‌గావ్ జిల్లాలో బుధవారం సాయంత్రం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు వ్యాపించాయన్న పుకార్లతో గబగబా రైలు దిగి పక్కనున్న ట్రాక్‌ను దాటుతుండగా ఎదురుగా వచ్చిన కర్ణాటక ఎక్స్‌ప్రెస్ వారిపైకి దూసుకెళ్లడంతో ఘోరం జరిగిపోయింది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. సాయంత్రం 5:30 గంటల సమయంలో మహేజి, పర్ధడే స్టేషన్ల మధ్యలోని పచోరా సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. లక్నో-ముంబయి మధ్య నడిచే పుష్పక్ ఎక్స్‌ప్రెస్ రైలులోని ఒక కోచ్‌లో హాట్ యాక్సిల్ లేదా బ్రేక్ బైండింగ్ కారణంగా నిప్పురవ్వలు చెలరేగడంతో మంటలు వ్యాపించాయన్న భయంతో ప్రయాణికులు చైన్ లాగారని ఒక అధికారి తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని పచోరాలోని ఆసుపత్రులకు తరలించినట్లు చెప్పారు.
ఈ రైలు ప్రమాదంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విచారం వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని, ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు.