కేరళలో భారీ వర్షాలకు ఆరుగురి మృతి

May 29,2024 08:54 #Remal Typhoon Effect, #West Bengal

తిరువనంతపురం : కేరళను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దక్షిణ తమిళనాడులో ఏర్పడిన తుపాను కారణంగా కేరళవ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచి ప్రారంభమైన వర్షాలు మంగళవారం కూడా కొనసాగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆరుగురు మరణించారు. తిరువనంతపురం ముతలాపోజి హార్బర్‌ ప్రాంతంలో ఒక పడవ బోల్తా పడటంతో అంచుతెంగుకు చెందిన మత్స్యకారుడు అబ్రహం (60) మరణించాడు. ఇడుక్కిలోని మరయూర్‌ సమీపంలో పాంబర్‌కు చెందిన 57 ఏళ్ల రాజన్‌ చేపలు పట్టుకుంటున్న సమయంలో నదిలో పడి మరణించాడు. తిరువనంతపురంలోని అరువిక్కరకు చెందిన 56 ఏళ్ల అశోక్‌, కన్హంగాడ్‌కు చెందిన 14 ఏళ్ల సినాన్‌, పెరుంబవూరులో 10వ తరగతి విద్యార్థి ఎల్డోన్‌ నదిలోని మునిగి చనిపోయారు. మావేలికరకు చెందిన 31 ఏళ్ల అరవింద్‌ కొబ్బరి చెట్టు మీద పడి మరణించాడు. భారీ వర్షాల కారణంగా కొచ్చిలో అనేక లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. భరణంగానం వద్ద కొండచరియలు విరిగిపడి ఏడు ఇళ్లు ధ్వంసమయ్యాయి. అనేక పర్యాటక ప్రాంతాలను అధికారులు మూసివేశారు.

➡️