బెంగళూరు : కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎం.కృష్ణ (సోమనహళ్లి మల్లయ్య కృష్ణ) (92) కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. మంగళవారం తెల్లవారుజామున బెంగళూరులోని సదాశివనగర్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా కొనసాగిన ఎస్‌ఎం కృష్ణ వివిధ కీలక పదవులు నిర్వహించారు. 2004-2009 మధ్య కర్నాటక సీఎంగా ఆయన పనిచేశారు. ఆ సమయంలో బెంగుళూరులో ఐటీ రంగం అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఆ తర్వాత 2004 డిసెంబర్ నుంచి 2008 మార్చి వరకు మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం యూపీఏ హయాంలో 2009- 2012 మధ్య విదేశాంగ మంత్రిగా ఎస్‌ఎం కృష్ణ పనిచేశారు. దాదాపు 50 ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎస్‌ఎం కృష్ణ.. 2017లో బిజెపిలో చేరారు. గతేడాది రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. 2023లో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది.
