ఎస్‌ఎం కృష్ణకు తీవ్ర అస్వస్థత

బెంగళూరు : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎం కృష్ణ (92) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొద్ది రోజుల కిందట అనార్యోగంతో స్థానిక మణిపాల్‌ ఆస్పత్రిలో చేరిన ఆయన ఆదివారం మరింత తీవ్రంగా అస్వస్థతకు గురికావడంతో ఐసియు వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఏప్రిల్‌ 21న అస్వస్థతకు గురికావడంతో ఆయనను తొలుత బెంగళూరులోని వైదేహి ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత అదే నెల 29న మణిపాల్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్‌ సత్యనారాయణ, డాక్టర్‌ సునీల్‌ కారంత్‌ నేతృత్వంలోని క్రిటికల్‌ కేర్‌ టీమ్‌ చికిత్స అందిస్తున్నారని మణిపాల్‌ వైద్యులు పేర్కొన్నారు. కాగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మణిపాల్‌ ఆస్పత్రికి వెళ్లి కఅష్ణను పలకరించారు. అలాగే ఆయనకు అందిస్తున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్‌ పార్టీలో ఎన్నో కీలక పదవులను అనుభవించిన ఎస్‌ఎం కృష్ణ 2004 నుంచి 2008 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రాజ్యసభకు ఎన్నికై కేంద్రమంత్రిగానూ సేవలందించారు. తర్వాత గవర్నర్‌ పదవిని చేపట్టారు. కొన్నేళ్ల క్రితం కాంగ్రెస్‌ను వీడి బిజెపిలో చేరారు. ఆ తర్వాత రాజకీయాలకు స్వస్థిపలికారు. తొంబైల్లో యాభైలా తాను ఉండలేనని అందుకే రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నానని అప్పట్లో ఆయన చెప్పారు.

➡️