Solidarity: పాలస్తీనా ప్రజలకు సంఘీభావ వెల్లువ

సామ్రాజ్యవాద దాడులను ఖండించాలని పిలుపు
తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని హితవు
ఢిల్లీలో వామపక్షాల ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : అమెరికా అండదండలతో అమానవీయ దాడులను నిరసిస్తూ పాలస్తీనా ప్రజానీకానికి దేశవ్యాప్తంగా వెల్లువలా సంఘీభావం వ్యక్తమవుతోంది. వామపక్షాలు, విద్యార్థి, యువజన సంఘాలు, ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలకు చెందిన కార్యకర్తలు వివిధ రూపాల్లో ఇజ్రాయిల్‌ దాడులను ఖండిస్తూ కార్యాక్రమాలు చేపట్టారు. ఢిల్లీలో వామపక్ష పార్టీల ఆధ్వర్యాన చేపట్టిన నిరసన కార్యక్రమంలో సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందా కరత్‌, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, సిపిఐ ఎంఎల్‌ ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి రవిరారు మాట్లాడారు. తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని, పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించాలని, ఇజ్రాయెల్‌పై సైనిక ఆంక్షలు విధించాలని డిమాండ్‌ చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందా కరత్‌ మాట్లాడుతూ.. పాలస్తీనాకు ఎల్లప్పుడూ సంఘీభావం ఉంటుందని, ప్రజలు ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండాలని అన్నారు. పాలస్తీనాలోని పిల్లలు, ప్రజలపై అనాగరిక భయానక దాడి కొనసాగుతోందని అన్నారు. ‘భారత ప్రభుత్వం ఇజ్రాయెల్‌కు సైనిక వస్తువులను సరఫరా చేయడానికి వీలున్న అన్ని లైసెన్సులనూ రద్దు చేయాలి. దేశంలో తయారు చేసిన డ్రోన్‌లు, పేలుడు పదార్థాలు పంపుతున్నారు. యుద్ధంలో, పాలస్తీనాపై మారణహోమంలో ఉపయోగిస్తున్నారు’ అని ఆమె పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌ నుండి భారతదేశం కూడా సైనిక, భద్రతా పరికరాలను దిగుమతి చేసుకుంటోందని, ఇది ఇజ్రాయెల్‌ తన చర్యల్లో ఆర్థికంగా సహాయపడుతుందని అన్నారు. పాలస్తీనా కార్మికుల స్థానంలో ఇజ్రాయెల్‌కు భారతీయ కార్మికులను పంపినందుకు ఆమె ప్రభుత్వాన్ని విమర్శించారు. ‘వేలాది మంది కార్మికులు ఇజ్రాయెల్‌కు పంపారు. ఇది ఇజ్రాయెల్‌ జియోనిస్ట్‌ ప్రభుత్వం వర్ణ వివక్ష విధానానికి ప్రత్యక్ష మద్దతు’ అని ఆమె విమర్శించారు. గాజాలో కొనసాగుతున్న దాడిని మతపరమైన యుద్ధంగా చిత్రీకరిస్తున్నారని, ఇది నిజం కాదని అన్నారు. ప్రపంచం చూసిన అత్యంత ఘోరమైన భయానక సంఘటనల్లో భారతదేశం భాగస్వామిగా ఉందని విమర్శించారు.

 


హద్దుమీరిన ఇజ్రాయిల్‌ దాష్టీకాలు : ఎస్‌ఎఫ్‌ఐ
పాలస్తీనా ప్రజలపై సామ్రాజ్యవాదుల అండదండలతో ఇజ్రాయిల్‌ హద్దుమీరి దాష్టీకాలు కొనసాగిస్తోందని భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దాడులను ప్రజలందరూ ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చింది. పాలస్తీనా ప్రజలపై సామ్రాజ్యవాద-జియోనిస్ట్‌ దురాక్రమణకు నిరసనగా ఎస్‌ఎఫ్‌ఐ దేశవ్యాప్తంగా సంఘీభావ దినోత్సవాన్ని నిర్వహించింది. శనివారం నాడిక్కడ హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌ భవన్‌లో జరిగిన సదస్సుకు పాలస్తీనా రాయబారి అద్నాన్‌ ముహ్మద్‌ అబుల్హాజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమెరికా సామ్రాజ్యవాదం మద్దతుతో ఇజ్రాయెల్‌ జియోనిస్ట్‌ శక్తులు పాలస్తీనా ప్రజలపై జరిపిన దాడి అన్ని హద్దులూ దాటిందని అన్నారు. దీనిపై అమెరికా యూనివర్సిటీలతో సహా వెల్లువెత్తుతున్న నిరసనలు, ఆగ్రహం ఆశాజనకంగా ఉన్నాయని అన్నారు. క్యూబా రాయబారి అబెల్‌ అబల్లే, ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షులు విపి సాను, ప్రధాన కార్యదర్శి మయూఖ్‌ బిస్వాస్‌, ఉపాధ్యక్షులు ప్రతీక్‌ ఉర్‌ రెహ్మాన్‌, సంగీత దాస్‌, ప్రధాన కార్యదర్శి మయూఖ్‌ బిస్వాస్‌, సెక్రటేరియట్‌ మెంబర్‌ ఐషి ఘోష్‌ మాట్లాడారు.

➡️