విభజన సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోండి

Feb 4,2025 00:19 #amicably, #divisive, #issues, #resolve
  • ఎపి, తెలంగాణ సిఎస్‌లకు కేంద్రం స్పష్టత

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మధ్య అపరిషతంగా ఉన్న విభజన సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ అంశాలపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తే సమస్యలు మరింత జఠిలమయి ఆలస్యం అవుతుందని సూచించింది. రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న అంశాలపై సోమవారం కేంద్ర హోం శాఖ సెక్రటరీ గోవింద్‌ మోహన్‌ అధ్యక్షతన కీలక భేటి జరిగింది. ఈ భేటిలో ఇరు రాష్ట్రాల సిఎస్‌ లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. దాదాపు అరగంటకు పైగా సాగిన ఈ భేటిలో… కీలకంగా విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్‌ లోని అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇందులో ప్రధానంగా అప్పులు, ఆస్తుల పై సవిరంగా చర్చ చేసినట్లు సమాచారం. అయితే… ఈ రెండు షెడ్యూల్‌ లకు సంబంధించిన 20 సంస్థల నిధుల పంపకంపై సానుకూలంగా ఉండాలని కేంద్రం సూచించింది. వీటిపై రెండు రాష్ట్రాలు సానుకూల వాతావరణంలో సామరస్యంగా పరిష్కరించుకోవాలని కేంద్ర హౌం శాఖ సెక్రటరీ సూచించారు. అవసరమైతే దష్టికి అంశాల వారిగా సమస్యలను రెండు రాష్ట్రాల సిఎంల తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని చెప్పినట్లు తెలిసింది.

విదేశీ అప్పుల పంపకంపై చర్చ

విదేశీ అప్పుల పంపకంపై రెండు రాష్ట్రాల సిఎస్‌ లకు కేంద్రం సూచనలు చేసింది. ఈ అప్పులపై న్యాయ సలహా తో ముందుకెళ్లాలని దిశా నిర్దేశం చేసింది. ఇందుకు ఇరు రాష్ట్రాలు అంగీకారం చెబుతూనే అడ్వకేట్‌ జనరల్‌ తో (ఎజి)లతో చర్చించి, అభిప్రాయం తీసుకుంటామని రాష్ట్ర అధికారులు బదులిచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అయితే ఎజి అభిప్రాయాల తర్వాత మరోసారి భేటి అయి, నిర్ణయం తీసుకుందామని కేంద్ర సెక్రటరీ చెప్పారని తెలిసింది. అయితే తాజా మీటింగ్‌ లోని అంశాలను సిఎం దృష్టికి తీసుకెళ్లి, తదుపరి మీటింగ్‌ కు హాజరవుతామని అధికారులు తెలిపారు.

➡️