సోనమ్‌ వాంగ్‌చుక్‌ విడుదల

  • నిషేధాజ్ఞలు వెనక్కి
  • కోర్టుకు విన్నవించిన కేంద్రం

న్యూఢిల్లీ : పర్యావరణ కార్యకర్త సోనమ్‌ వాంగ్‌చుక్‌, ఆయన సహచరులను నిర్బంధం నుండి విడుదల చేసినట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది. ఇందుకు సంబంధించిన కేసులో విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టుకు ఈ విషయాన్ని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా తెలియజేశారు. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల ప్రజలు గుమిగూడడంపై, నిరసనలు తెలియచేయడంపై పోలీసులు విధించిన నిషేధాజ్ఞలను కూడా ఉపసంహరించినట్లు తెలిపారు. వాంగ్‌చుక్‌ ప్రభృతులను విడుదల చేయాలని, నిషేధాజ్ఞలను ఉపసంహరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను చీఫ్‌ జస్టిస్‌ మన్మోహన్‌, జస్టిస్‌ తుషార్‌ రావుతో కూడిన బెంచ్‌ విచారిస్తోంది. రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌లో లడఖ్‌ను చేర్చాలని కోరుతూ రాజధానికి ప్రదర్శనగా వెళుతుండగా, వాంగ్‌చుక్‌తో పాటూ దాదాపు 120 మందిని ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. నెల రోజుల క్రితం లేV్‌ా నుండి ఢిల్లీ చలో పాదయాత్ర ప్రారంభమైంది. అయితే ఆయనను పోలీసులు నిర్బంధించారని, విడుదల చేసినట్టే చేసి మళ్లీ నిర్బంధించారంటూ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఆయనను విడుదల చేయాలని కోరుతూ ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే వాస్తవానికి పోలీసులు ఆయనను నిర్బంధించడం వాస్తవం కాదని, వారు బుధవారం రాజ్‌ఘాట్‌ను కూడా సందర్శించారని తుషార్‌ మెహతా అన్నారు. అక్కడ రెండు గంటల పాటు వున్నారని, కేంద్ర హోం శాఖలో కొన్ని మెమరాండాలు కూడా ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత వారు వెల్ళిపోయారని మెహతా చెప్పారు. మెహతా వాదనతో పిటిషనర్ల తరపు న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ విభేదించారు. సోనమ్‌, ఆయన అనుచరులు జంతర్‌మంతర్‌ వరకు వెళ్లాలని అనుకున్నారని, కానీ పోలీసులు వారిని అడ్డుకున్నారని చెప్పారు. అక్కడికి వెళ్లకుండా వారిపై నిషేధం విధించారని చెప్పారు. వాంగ్‌చుక్‌ను ఇతరులతో కలవనివ్వకుండా విడిగా వుంచారని చెప్పారు. అయితే ఇదంతా తప్పుడు ప్రకటనలని మెహతా అభ్యంతరం వ్యక్తం చేశారు. వాంగ్‌చుక్‌, ఇతరుల విడుదలపై తుషార్‌ మెహతా ఇప్పటికే ఒక ప్రకటన చేశారని, వాంగ్‌చుక్‌ విడుదలయ్యారని జస్టిస్‌ మన్మోహన్‌ వ్యాఖ్యానించారు.

➡️