National Herald Case : సోనియా, రాహుల్‌పై ఛార్జిషీట్‌

  • నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఇడి చర్యలు

న్యూఢిల్లీ : నేషనల్‌ హెరాల్డ్‌కు సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో కాంగ్రెస్‌ నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, శామ్‌ పిట్రోడాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. ఆ ఛార్జిషీట్‌ పరిశీలనను ఈ నెల 25కి ఢిల్లీ కోర్టు వాయిదా వేసింది. ఈ నెల 9న ఇడి చార్జిషీట్‌ను దాఖలు చేయగా, మంగళవారం దానిని ప్రత్యేక న్యాయమూర్తి విశాల్‌ గోగే విచారించారు. ప్రాసిక్యూషన్‌ ప్రస్తుతం చేసిన ఫిర్యాదుపై 25వ తేదీన విచారణ జరపనున్నట్లు కోర్టు పేర్కొంది. ఆ రోజు నాటికి ఇడి, ఐఓల తరపు ప్రత్యేక న్యాయవాది ఈ కేసు డైరీలన్నింటినీ కోర్టుకు అందజేయాలని కోరింది. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ), 2022లోని 44, 45 సెక్షన్ల కింద ఛార్జిషీట్‌ను దాఖలు చేసినట్లు ఇడి వర్గాలు తెలిపాయి. అనుబంధ ఛార్జిషీట్‌లో సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, పార్టీ విదేశీ చీఫ్‌ శామ్‌ పిట్రోడా, సుమన్‌ దూబేలను నిందితులుగా చేర్చినట్లు ఇడి అధికారులు తెలిపారు. ఈ కేసులో సంబంధిత ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రక్రియలో భాగంగా ఢిల్లీ, ముంబయి, లక్నో ప్రాపర్టీ రిజిస్ట్రార్లకు ఇడి గత వారం నోటీసులు జారీ చేసింది. ముంబయిలోని బాంద్రా, ఢిల్లీలోని బహదూర్‌ షా జాఫర్‌ మార్గ్‌, లక్నోలోని విశ్వేశ్వర్‌నాథ్‌ రోడ్‌లలో ఈ ఆస్తులు వున్నాయి. బాంద్రా భవనంలోని 7, 8, 9 అంతస్తులను ఆక్రమించుకున్న జిందాల్‌ సౌత్‌ వెస్ట్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌కు కూడా ఇడి నోటీసులు పంపింది. నెలవారీ అద్దెలను తమకు బదలాయించాలని కోరింది. నేరాల ద్వారా వచ్చిన రూ.988 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించి, జప్తు చేసుకోవడానికి ఇడి చాలా విస్తృత దర్యాప్తు చేసిందని, ఆ తర్వాత వాటిని జప్తు చేసిందని ఇడి అధికారులు తెలిపారు. బిజెపి సీనియర్‌ నేత సుబ్రమణ్యస్వామి ఇచ్చిన ఫిర్యాదుపై 2014 జూన్‌ 26న పాటియాలా హౌస్‌ కోర్టు ఆఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ జారీ చేసిన ఆదేశాలపై 2021లో ఇడి దర్యాప్తు ఆరంభమైంది. నిందితులు పలు సందర్బాల్లో తమపై వచ్చిన ఆరోపణలు తిరస్కరించారు. సోనియా, రాహుల్‌, శామ్‌ పిట్రోడా, యంగ్‌ ఇండియన్‌ వంటి ప్రైవేట్‌ కంపెనీలతో సహా పలువురు రాజకీయ నేతలు అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ (ఎజెఎల్‌)కు చెందిన రూ2 వేల కోట్ల విలువైన ఆస్తులను అక్రమ పద్ధతుల్లో స్వాధీనం చేసుకునేందుకు మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారని ఇడి పేర్కొంది.

➡️