న్యూఢిల్లీ : ఇటీవల చర్చనీయాంశమైన అధిక పనిగంటలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) మాజీ అధ్యక్షురాలు, శాస్త్రవేత సౌమ్య స్వామినాథన్ సౌమ్యనాథన్ స్పందించారు. ముందుగా శరీరం చెప్పేది వినాలని, విశ్రాంతి అవసరాన్ని గుర్తించాలని స్పష్టం చేశారు. అధిక పనిగంటలు ఉత్పాదకత తగ్గడానికి దారితీయవచ్చని హెచ్చరించారు. ఉత్పాదకత అనేది పని నాణ్యతపై ఆధారపడి ఉంటుందని, పని గంటలపై కాదని ఉద్ఘాటించారు. మానసిక ఆరోగ్యం, విశ్రాంతి నాణ్యమైన పనికి కీలకమని స్వామి సౌమ్యనాథన్ పునరుద్ఘాటించారు.
అధిక పనిగంటలపై ఆదివారం ఆమె మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అధిక పనిగంటలు ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపుతాయన్న ప్రశ్నపై మాట్లాడారు. ”సమయంతో సంబంధం లేకుండా చాలా మంది ఎక్కువగా శ్రమపడుతుండటం నాకు తెలుసు. అయితే అది వారి వ్యక్తిగత విషయం. బాగా శ్రమించి అలిసిపోతే శరీరం మీకు చెబుతుంది. అప్పుడు శరీరం చెప్పినట్లు వినాలి. స్వల్పకాలం పాటు అధికంగా పనిచేయడం అనేది సాధ్యమే. కొవిడ్-19 సమయంలో ఇదే విధానాన్ని పాటించాం. అయితే సుదీర్ఘ కాలం కొనసాగించడం సరికాదు. ఆసమయంలో అందరం కష్టపడి పనిచేశాం. ఇది సరైనదేనా, ఎక్కువ కాలం పాటు కొనసాగించగలమా అనే అంశంపై స్పష్టత లేదు ” అని అన్నారు.
”కొవిడ్ సమయంలో రెండు మూడేళ్లు చాలా కష్టపడ్డాం. నిద్రలేకుండా ఎక్కువ సేపు పనిచేయడంతో ఒత్తిడికి గురయ్యాం. ముఖ్యంగా వైద్యులు, సిబ్బంది, ఇతర ఆరోగ్య సంరక్షకుల గురించి ఆందోళన చెందాం. అధిక శాతం మంది 24 గంటలు పనిచేస్తూనే ఉన్నారు. కొంతమంది తీవ్రంగా అలిసిపోయారు. ఆ తర్వాత చాలా మంది ఈ వృత్తినే వదులుకున్నారు. స్వల్పకాలం అధిక పనిగంటలు సాధ్యమే కానీ నిరంతరం కొనసాగించలేం. శరీరానికి నిద్ర చాలా అవసరం” అని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
12 గంటలపాటు పనిచేసినా, ఎనిమిది గంటల తర్వాత మన పనిలో నాణ్యతను పరిశీలించుకోవాలని అన్నారు. అధిక పనిగంటల విషయంలో వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాల్సి వుందని అన్నారు.
ఇటీవల ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి వారానికి 70 గంటలు పనిచేయాలని పేర్కొన్న సంగతి తెలిసిందే.