24 నుంచి పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు

Jun 12,2024 08:36 #Parliament

26న లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక
ప్రొటెం స్పీకర్‌గా కె.సురేష్‌, రాధామోహన్‌ సింగ్‌ పేర్లు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు ఈనెల 24 నుంచి జులై 3 వరకూ జరగనున్నాయి. ఈ సమావేశాల్లో లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక, కొత్త ఎంపిల ప్రమాణ స్వీకారం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు మంగళవారం తెలిపాయి. ఎనిమిది రోజులపాటు ఈ పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జూన్‌ 26న లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. జూన్‌ 24, 25 తేదీల్లో కొత్త పార్లమెంట్‌ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రొటెం స్పీకర్‌గా కాంగ్రెస్‌ ఎంపి కె.సురేష్‌, బిజెపి ఎంపి రాధామోహన్‌సింగ్‌ పేర్లు వినిపిస్తున్నాయి. ప్రొటెం స్పీకరే ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. మోడీ 3.0 కేబినెట్‌ కూర్పు కూడా పూర్తయింది. మొత్తం 71 మంది ఎంపిలకు మంత్రులుగా అవకాశం దక్కింది. వీరందరికీ శాఖలు కూడా కేటాయించడంతో మంగళవారం బాధ్యతలు చేపట్టారు.
రాజ్యసభలో పది స్థానాలు ఖాళీ
రాజ్యసభలో పది స్థానాలు ఖాళీ అయ్యాయి. ఇటీవల జరిగిన లోక్‌సభకు పది మంది సభ్యులు ఎన్నిక కావడంతో ఆ స్థానాలు ఖాళీ అయ్యాయి. రాజ్యసభ సెక్రటేరియట్‌ ఆ ఖాళీలను నోటిఫై చేసింది. ఇందులో అస్సాం, బీహార్‌, మహారాష్ట్రలలో రెండు, హర్యానా, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, త్రిపురలలో ఒక్కొక్కటి ఉన్నాయి. రాజ్యసభ సెక్రటేరియట్‌ సీట్ల ఖాళీ వివరాలను తెలియజేస్తూ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. ”కామాఖ్య ప్రసాద్‌ తాసా, సర్బానంద సోనోవాల్‌ (అస్సాం), మిషా భారతి, వివేక్‌ ఠాకూర్‌ (బీహార్‌), దీపేందర్‌ సింగ్‌ హుడా (హర్యానా), జ్యోతిరాదిత్య సింధియా (మధ్యప్రదేశ్‌), ఉదయన్‌రాజే భోంస్లే (మహారాష్ట్ర), పీయుష్‌ గోయల్‌ (మహారాష్ట్ర), కెసి వేణుగోపాల్‌ (కేరళ), విప్లవ్‌ కుమార్‌ దేవ్‌ (త్రిపుర) ఖాళీలు ఏర్పడ్డాయి. నోటిఫికేషన్‌ తరువాత ఈ ఖాళీల భర్తీకి ఎన్నికల కమిషన్‌ తేదీలను ప్రకటించనుంది.

➡️