ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాజ్యాంగానికి ఆమోదం లభించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నవంబరు 26న పార్లమెంటు ఉభయ సభలు ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. 1949 నవంబరు 26న రాజ్యాంగాన్ని ఆమోదించిన పార్లమెంటు సెంట్రల్ హాల్లోనే ఉభయ సభల సభ్యులు సమావేశమవుతారు. రాజ్యాంగానికి ఆమోదం లభించినప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ ఆర్టికల్స్, చట్టాల్లో జరిగిన మార్పులు, చేర్పుల గురించిన విషయాలు ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. కాగా, గతంలో నవంబరు 26న జాతీయ న్యాయ దినోత్సవంగా నిర్వహించేవారు. అయితే 2015లో అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని ఆ రోజును రాజ్యాంగ దినోత్సవంగా మార్చారు. వచ్చే నవంబరు 26 నాటికి మన రాజ్యాంగం ఆమోదం పొంది సరిగ్గా 75 ఏళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ఆ రోజున పార్లమెంటు ఉభయసభలను ప్రత్యేకంగా సమావేశపర్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.