ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మహారాష్ట్రలో తొలిసారిగా మహిళా రైతుల రాష్ట్ర సదస్సు జరిగింది. నాసిక్ నగరంలోని కామ్రేడ్ గోదావరి పరులేకర్ హాల్‌లో ఈ మహిళా రైతు రాష్ట్ర సదస్సును ఎఐకెఎస్ మహారాష్ట్ర రాష్ట్ర కమిటీ నిర్వహించింది. ఈ సదస్సులో 15 జిల్లాల నుండి మొత్తం 515 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ముఖ్యంగా థానే-పాల్ఘర్ (155), అహ్మద్‌నగర్ (109), నాసిక్ (93) జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సదస్సులో ముందుగా కిసాన్ సభ జెండా ఎగురవేసిన తరువాత ఎఐకెఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉమేష్ దేశ్‌ముఖ్ స్వాగతించారు. ఎఐకెఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ అజిత్ నవాలే సమావేశం లక్ష్యాన్ని వివరించారు. ఇది ఐదుగురు సభ్యులతో కూడిన అధ్యక్షవర్గంతో మొత్తం మహిళల వేదికగా నిలిచింది. ఈ సదస్సును ఐద్వా ప్రధాన కార్యదర్శి మరియం ధావలే ప్రారంభించారు. మహిళా కిసాన్ అధికార్ మంచ్‌కి చెందిన సీమా కులకర్ణి సభలో ప్రసంగించారు. ఎఐకెఎస్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు డాక్టర్ కవితా వారే 17 పాయింట్ల చార్టర్ ఆఫ్ డిమాండ్స్‌ను ప్రవేశపెట్టారు. సిఐటియు, ఐద్వా, ఎఐఎడబ్ల్యుయు, ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ తదితర సంఘాల నుంచి 21 మంది మహిళ ప్రతినిధులు రైతు సమస్యలపై మాట్లాడారు. అలాగే, ఈ సదస్సులో సిఐటియు ఉపాధ్యక్షులు డాక్టర్ డి ఎల్ కరాడ్, సిపిఎం ఎమ్మెల్యే వినోద్ నికోలే, సిఐటియు శ్రామిక మహిళా నాయకులు శుభ షమీమ్, ఆనంది అవఘాడే, ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు నసీమా షేక్, డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి దత్తా చవాన్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు సోమనాథ్ నిర్మల్ ప్రసంగించారు. ముగింపు ప్రసంగాన్ని ఎఐకెఎస్ అధ్యక్షుడు డాక్టర్ అశోక్ ధావలే చేశారు.
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతమంతటా చార్టర్ ఆఫ్ డిమాండ్స్‌ను ప్రాచుర్యంలోకి తీసుకురావాలని, మహిళా రైతుల జిల్లా స్థాయి సమావేశాలను నిర్వహించాలని సదస్సు నిర్ణయించింది. డిమాండ్స్ చార్టర్‌లో ప్రముఖంగా ప్రస్తావించిన అంశాలపై పోరాటాలు నిర్ణయించాలని పిలుపు ఇచ్చింది.
![](https://prajasakti.com/wp-content/uploads/2025/01/mahila-sadassu.jpg)