- ప్రధానితో ముగిసిన సిఎం భేటీ
- డిసెంబర్‌లో వైజాగ్ రైల్వే జోన్‌కు శంకుస్థాపన
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ప్రధాన మంత్రి నరేంద్రమోడీతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం జరిపిన భేటీలో విశాఖ ఉక్కు అంశం ప్రస్తావనకే రాలేదా? … వచ్చినా ప్రధాన మంత్రి స్పందించలేదా? ఈ విషయమై సందిగ్థత నెలకొంది. దాదాపు గంటపాటు ప్రధానితో ఆయన నివాసంలో జరిపిన చర్చల అనంతరం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో చేసిన పోస్టులో ఈ అంశాన్ని ముఖ్యమంత్రి పేర్కొనపోవడమే దీనికి కారణం. భేటీ అనంతరం ‘ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ఫలవంతమైన సమావేశం జరిగింది. పోలవరం ప్రాజెక్టు సవరించిన ఖర్చు అంచనాలకు కేబినెట్ ఆమోదం తెలిపినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపాను. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఆయనకు వివరించాను. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడికి సంబంధించిన విషయాలలో కేంద్ర ప్రభుత్వం మద్దతు, హామీకి నేను కతజ్ఞతలు తెలిపాను. రాజధాని నగరం అమరావతికి ఆయన మద్దతును అభినందించాను” అంటూ చంద్రబాబు నాయుడు ఎక్స్‌లో పేర్కొన్నారు. దీంతో చంద్రబాబు ప్రధానికి ఏ విషయాలు వివరించిఉంటారన్న అంశం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిన తిరుమల నెయ్యి కల్లీ వ్యవహారాన్ని ఆయన ఖచ్చితంగా ప్రధాని దృష్టికి తీసుకువెళ్లి ఉంటారని భావిస్తున్నారు. ఈ కల్తీ వ్యవహారంలో వైసిపి నేతల ప్రమేయం ఉందని చంద్రబాబుతో పాటు, పలువురు రాష్ట్ర మంత్రులు ఆరోపించిన విషయం, అనంతరం చోటు చేసుకున్న పరిణామాల్లో సుప్రీంకోర్టు ప్రత్యేక సిట్‌కు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ అంశం దేశ వ్యాప్తంగా కలకలం రేపడంతో చంద్రబాబు దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల నెయ్యి అంశం ఇరువురు నేతల మధ్య ఖచ్చితంగా చర్చకు వచ్చిఉంటుందని భావిస్తున్నారు. ఈ కల్తీ అంశం తరువాత రాష్ట్రంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటమే చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఉక్కు పరిశ్రమలో వరు సగా చోటుచేసుకుంటున్న పరిణామాలతో కార్మికులు తీవ్ర స్థాయిలో ఆగ్రహంగా ఉన్నారు. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంతగా ఉధృత పోరాటాలకు వారు సిద్ధమౌతున్నారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నుండి కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గాలని, ఈ మేరకు ప్రధాని మోడీ చేత ప్రకటన చేయించాలని వారు పట్టుబడుతున్నారు. కొద్దిరోజులుగా ఈ విషయం రాష్ట్రంలో చర్చనీయాంశం కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని దృష్టికి ఈ విషయం తీసుకుని వెళ్లే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అయితే, భేటీ తరువాత బాబు చేసిన ప్రకటనలో ఆ ఊసే లేదు. ప్రధాని కార్యాలయంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇతర సంస్థలు కూడా సిఎం భేటీ తరువాత విశాఖ ఉక్కుపై ఎటువంటి వివరణ ఇవ్వలేదు. రాష్ట్రానికి చెందిన మరో కీలకాంశం ప్రత్యేకహోదాపై టిడిపి వైఖరి తెలిసిందే. మరోవైపు మంగళవారం ముఖ్యమంత్రి పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు పరిశ్రమపై మాట్లాడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నప్పటికీ, బాబు కలిసే మంత్రుల జాబితాలో ఉక్కుశాఖ మంత్రి లేకపోవడం గమనార్హం. బుడమేరు వరదలపై నివేదిక ఇచ్చిన తరువాత తొలిసారి ప్రధాని మోడీతో జరిపిన ఈ భేటీలో సిఎం చంద్రబాబు వరదలకు నష్టపోయిన రాష్ట్రానికి మరిన్ని నిధులు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ పనులు తిరిగి ప్రారంభించాలని, మరో సీజన్ నష్టపోకుండా నవంబర్‌లో వరద తగ్గుముఖం పట్టగానే కొత్త డయాఫ్రంవాల్ నిర్మాణ పనులు ప్రారంభించి వేసవి కల్లా పూర్తిచేసేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు వెంట కేంద్ర మంత్రులు కె.రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, టిడిపి ఎంపి లావు శ్రీకృష్ణ దేవరాయలు ఉన్నారు.
రైల్వేశాఖ మంత్రితో
అనంతరం కేంద్ర రైల్వే, ఐటీ, సమాచార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సిఎం చంద్రబాబు భేటీ అయ్యారు.ఈ భేటీ ముఖ్యమంత్రి అధికారిక నివాసం 1 జన్‌పథ్‌లో జరిగింది. అనంతరం ‘డిసెంబరులో వైజాగ్ రైల్వే జోన్‌కు శంకుస్థాపన చేస్తారని ఆశాభావం ఉంది. ఆంధ్రప్రదేశ్ అంతటా వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో రైల్వే రూ. 73,743 కోట్ల పెట్టుబడి పెడుతుందని రైల్వే మంత్రి తెలియజేశారు. ఈ ప్రాజెక్టులలో ఆంధ్రప్రదేశ్‌లో హౌరా-చెన్నై మధ్య నాలుగు లైనింగ్, 73 స్టేషన్లను ఆధునీకరించడం, మరిన్ని లోకల్ రైళ్లను ప్రవేశపెట్టడం ఉన్నాయి’ అని బాబు ఎక్స్‌లో పేర్కొన్నారు. అనంతరం టిడిపి ఎంపిలతో కలిసి సిఎం చంద్రబాబు 1 జన్‌పథ్‌లో డిన్నర్ చేశారు.
నేడు కేంద్ర మంత్రులతో భేటీ
నేడు (మంగళవారం) సిఎం చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, పియూష్ గోయల్, హర్దీప్ సింగ్ పూరీలతో భేటీ కానున్నారు. తొలుత ఉదయం 11్ణ30 గంటలకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీతోనూ, సాయంత్రం 4్ణ30 గంటలకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్‌తోనూ, సాయంత్రం 5్ణ30 గంటలకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీతోనూ, రాత్రి 8 గంటలకు కేంద్ర హౌం మంత్రి అమిత్ షాతోనూ, రాత్రి 11్ణ15 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ భేటీ కానున్నారు.