పేదల సొమ్ముపై స్టాక్‌ పంజా

May 29,2024 08:26 #money, #poor people's, #Stock claws

-కుప్పకూలితే అతలాకుతలం
-ఆర్థికవ్యవస్థకు ప్రమాదఘంటిక
న్యూఢిల్లీ : ‘కారులో షికారు కెళ్లే పాల బుగ్గల పసిడి దానా.. బుగ్గ మీద గులాబి రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా..’ అంటూ సాగే పాత సినిమా పాట గుర్తుందా? ఆ తరువాత చరణంలో గులాబి రంగు రావడానికి కారణమేమిటో రచయిత చెప్తాడు. అలా ప్రశ్న మీద ప్రశ్న వేసుకుంటూ చివరకు ‘చాకిరొకరిది…సౌఖ్యమొకరిది సాగదింక తెలుసుకో’ అంటూ పాట ముగుస్తుంది. భారతీయ స్టాక్‌ మార్కెట్‌ పరిస్థితి కూడా ప్రస్తుతం ఇంతే! శత కోటీశ్వర్లకు నిమిషాలు, గంటల్లోనే వందల కోట్లలో లాభాన్ని ఆర్జించిపెడుతున్న స్టాక్‌ మెరుపుల వెనుక పేద, మధ్యతరగతి ప్రజల కష్టార్జితం ఉంది. ఒక వ్యూహం ప్రకారం పంజా విసిరి వారి నుండి గుంజుకుంటున్న సంపద వుంది. షేర్‌ మార్కెట్‌ లాభాల వెనుక రోజురోజుకి పెరుగుతున్న సామాన్యుల ఆశలు, కష్టాలు, కన్నీళ్లు ఉన్నాయి. తాజా గణాంకాల ప్రకారం స్టాక్‌ మార్కెట్లో సామాన్యుల పెట్టుబడులు ఏడాదికేడాదికి పెరుగుతున్నాయి. సాంప్రదాయ పొదుపు విధానాలకు చెల్లుచీటి ఇస్తూ షేర్ల మాయాజాలంలో చిక్కుకుంటున్న వారి సంఖ్య ప్రతి సంవత్సరం భారీగా పెరుగుతోంది. నయా ఉదారవాద విధానాల్లో భాగంగా ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలే దీనికి కారణం. విచ్చలవిడిగా పెరుగుతున్న యాప్‌లు, సోషల్‌ మీడియా ప్రచారాలు సామాన్యుల కష్టార్జితానికి గాలం వేస్తున్నాయి. మరోవైపు పెన్షన్‌ ఫండ్‌ను ఎల్‌ఐసి నిధులను ప్రభుత్వం ఈ మాయా జూదంలో పెడుతోంది.
పొదుపు సొమ్ముకు రెక్కలు ఇలా…
ఆర్థిక మంత్రిత్వశాఖ అందించిన తాజా గణాంకాల ప్రకారం భారతీయ కుటుంబాలు 2020-21లో 22.8 లక్షల కోట్ల మేర నికర ఆర్థిక ఆస్తులను (నెట్‌ ఫైనాన్షియల్‌ అసెట్స్‌) జోడించాయి. 2022లో ఈ మొత్తం 17 లక్షల కోట్ల రూపాయలకు, 2023లో 13,8 లక్షల కోట్ల రూపాయలకు ఈ మొత్తం తగ్గింది. సాధారణంగా బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, లేదా ఆస్తుల కొనుగోళ్ల రూపంలో చేసే పొదుపు కొన్ని సంవత్సరాలుగా స్టాక్‌ మార్కెట్‌కు తరలిపోతోంది. స్వల్ప కాలంలో అధికాదాయం సంపాదించవచ్చన్న ఆశతో కొందరు స్టాక్‌ మార్కెట్‌ వైపు పరుగులు తీస్తున్నారు. షేర్లలో పెట్టుబడులు మార్కెట్‌ రిస్కులకు లోబడి ఉంటుందంటూ చేసే నామమాత్రపు హెచ్చరికల కన్నా సోషల్‌ మీడియా ప్రచార ప్రభావం ఎక్కువగా ఉంటోంది. దీనిని నియంత్రించడానికి ప్రభుత్వం సిద్ధపడటం లేదు. దీంతో స్టాక్‌ మార్కెట్‌లో జరగరానిది జరిగి పతనం చోటుచేసుకుంటే దాని ప్రభావం అసంఖ్యాకంగా ఉన్న వీరందరిపైనా తీవ్రంగా పడనుంది. ప్రతి సంవత్సరం ఇలా స్టాక్‌ మార్కెట్లోకి వస్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతుండటంతో అటువంటి పతనం ఆర్థిక వ్యవస్థను సైతం అతలాకుతలం చేసే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
నాలుగేళ్లలో మూడు రెట్లు
ఈక్విటి మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్న వారి సంఖ్య నాలుగేళ్లలో మూడు రెట్లు పెరిగింది. ఎన్‌ఎస్‌ఇ, రిజర్వు బ్యాంకు గణాంకాల ప్రకారం 2020లో సుమారుగా 3 కోట్లగా ఉన్న వీరి సంఖ్య 2024 ఏప్రిల్‌ నాటికి 9 కోట్లకు చేరింది. మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడులు పెడుతున్న వారి సంఖ్య 2020 డిసెంబర్‌ నాటికి 2.1 కోట్లుగా ఉండగా, 2024 ఏప్రిల్‌ నాటికి ఆ సంఖ్య 4.5 కోట్లకు చేరింది. 2023లో సిఎంఎస్‌ విడుదల చేసిన నివేదిక ప్రకారం 2019ా2023 మధ్మ దేశవ్యాప్తంగా 1.50 కోట్ల మంది మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టారు. వీరిలో సగానికిపైగా సోషల్‌మీడియాను పెద్దఎత్తున అనుసరించే వారే కావడం గమనార్హం. 2023లో వీరి మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడుల్లో దాదాపు 90శాతం ఈక్విటి విభాగంలో పెట్టారు. 2013ా14లో 25 వేల కోట్ల రూపాయలుగా ఉన్న స్టాక్‌ పెట్టుబడులు , 2022ా23 నాటికి 2లక్షల కోట్ల రూపాయలకన్నా ఎక్కువకు చేరుకున్నాయి. ఒకవైపు ఈ పెరుగుదలపై ఆందోళన వ్యక్తమవుతుండగా, మరోవైపు పెద్ద సంఖ్యలో ప్రజలను ఈ రొంపిలోకి దించడానికి షేర్‌ మార్కెట్‌ వర్గాలు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి.

➡️