జర్నలిస్టుపై బిజెపి కార్యకర్తల దాడి

న్యూఢిల్లీ : బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీకి కేంద్రం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. ఫిబ్రవరి 3వ తేదీన ప్రధాని మోడీ అద్వానీకి భారత పురస్కారాన్ని ప్రకటించారు. సరిగ్గా ఒకరోజు తర్వాత అంటే ఫిబ్రవరి 4వ తేదీన ప్రముఖ జర్నలిస్టు నిఖిల్‌ వాగ్లే అద్వానీకి భారత రత్న అవార్డును ప్రకటించడంపై కామెంట్‌ చేశారు. ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ‘ఒక అల్లరి చేసిన వ్యక్తి.. మరొక అల్లరి చేసిన వ్యక్తికి అవార్డు ఇచ్చారు’ అని మరాఠీలో పోస్టు చేశారు. ఈ పోస్టు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అప్పటినుంచి అతనిపై వరుసగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా శుక్రవారం రాత్రి పూనెలో బిజెపి కార్యకర్తలు అతని కారుపై దాడి చేశారు. కారు అద్దాల్ని పగలగొట్టారు. ఈ మేరకు ఆయన దాడికి సంబంధించి శనివారం ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘ఇప్పటివరకు ఆరు దాడులను ఎదుర్కొన్నాను. నిన్న రాత్రి జరిగిన దాడి అత్యంత దారుణం. రాళ్లు కర్రలు, హాకీ స్టిక్‌లు, రాడ్‌లు, గుడ్లు, సిరా ఇలా ఏవి పడితే వాటన్నింటినీ వాడారు. కేవలం అరగంటలో నాలుసార్లు నన్ను వెంబడించి చుట్టుముట్టారు. ఈ దాడి పోలీసుల అండతోనే జరిగింది.’ అని ఆయన పోస్టులో ఏర్కొన్నారు. పూలే- అంబేద్కర్‌ ఆశీస్సులతోనే నిన్న మనమందరం బతికామని నా నమ్మకం అని ఎక్స్‌లో పేర్కొన్నారు. కాగా, శుక్రవారం ఉదయం బిజెపి కార్యకర్తలు వాగ్లేకి వ్యతిరేకంగా నిరసనలు చేశారు. అయితే బిజెపి కార్యకర్తల నిరసనలకు తాను ఏమాత్రం భయపడిపోనని వాగ్లే స్పష్టం చేశారు. ‘ఫాసిజాన్ని ఓడించేందుకు మహారాష్ట్రను గెలిపిస్తాం. ఇలాంటి పిరికిదాడులకు భయపడే సంస్కృతి మనకు లేదు. ఈ దేశం హిందూ పాకిస్తాన్‌గా మారకుండా ఉండాలంటే మళ్లీ నా ప్రాణాలను పణంగా పెడతాను’ అని వాగ్లే వ్యాఖ్యానించారు.

మరోవైపు అద్వానీకిచ్చిన భారతరత్న అవార్డుకు సంబంధించి వాగ్లే మోడీపై చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బిజెపి సీనియర్‌ నేత సునీల్‌ దేవధర్‌ శుక్రవారం విశ్రాంబాగ్‌ పోలీస్‌స్టేషన్‌లో వాగ్లేపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్‌ 153 ఎ (వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, 500 (పరువునష్టం కోసం శిక్ష), 505 (బహిరంగ దుశ్చర్యలకు దారితీసే ప్రకటనలు) కింద వాగ్లేపై బిజెపి నేత సునీల్‌ కేసు నమోదు చేశారు.

నిఖిల్‌ వాగ్లేపై బిజెపి కార్యకర్తలు తీవ్రంగా దాడికి పాల్పడటాన్ని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ విమర్శించారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న బిజెపి కార్యకర్త ఎవరైనా సరే వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటారని ఫడ్నవీస్‌ అన్నారు. ఇదిలా ఉండగా ఆ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ ఎన్‌సిపి (నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ) ఎంపి సుప్రియా సూలే వాగ్లేపై చేసిన దాడిన తీవ్రంగా ఖండించారు. బిజెపికి అల్లర్లు చేయడానికి లైసెన్స్‌ ఎవరు ఇచ్చారు అని ఆమె ప్రశ్నించారు. ఇక ఈ సందర్భంగా శివసేన (యుబిటి) నాయకుడు సంజరు రౌత్‌ కూడా మహా వికాస్‌ అఘాడి (ఎంవిఎ)కి చెందిన పలువురు మహిళా కార్మికులను బిజెపి గూండాలు కొట్టారని ఆయన ఆరోపించారు.

➡️