చట్టాలను ఉల్లంఘించి ప్రైవేటు సంస్థలకు ఎలా ఇస్తారు ?
సిపిఎం పొలిట్‌బ్యూరో ప్రశ్న
న్యూఢిల్లీ : బహిరంగ, పారదర్శక వేలం ద్వారా కాకుండా ఒక విదేశీ సంస్థకు, దానితో జత కట్టిన ఇతర ప్రైవేటు సంస్థలకు స్పెక్ట్రమ్‌ను ఏకపక్షంగా కట్టబెట్టడం మన దేశ చట్టాలకు తీవ్ర విరుద్ధమని సిపిఎం పేర్కొంది. తక్షణమే స్టార్ లింక్ ఒప్పందాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం పొలిట్‌బ్యూరో ఒక ప్రకటన జారీ చేసింది. దేశంలో అధిక వేగంతో ఉపగ్రహ ఆధారిత ఇంటర్‌నెట్ సేవలు ఇచ్చేందుకు జియో, ఎయిర్‌టెల్ ఎలన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌తో పొత్తు కుదుర్చుకున్నట్లు ఇటీవల వచ్చిన వార్తలతో స్పెక్ట్రమ్ కేటాయింపులు, జాతీయ భద్రతా ఆందోళనలకు సంబంధించి తీవ్ర ప్రశ్నలు తలెత్తాయని పొలిట్‌బ్యూరో పేర్కొంది. స్పెక్ట్రమ్ అనేది అత్యంత కొరతగా వున్న వనరు అయినందున పారదర్శక, బహిరంగ వేలం ద్వారా మాత్రమే ప్రైవేటు వ్యక్తులకు కేటాయించవచ్చని 2జి కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది. అలాకాకుండా సెక్ట్రమ్ కేటాయింపునకు జరిగిన ఏ ప్రైవేటు ఒప్పందమైనా అది దేశ చట్టాలను ఉల్లంఘించినట్లే అవుతుందని పొలిట్‌బ్యూరో స్పష్టం చేసింది. భారతదేశంలోని కోట్లాది మంది టెలికం వినియోగదారులను పణంగా పెట్టి ఉపగ్రహ స్పెక్ట్రమ్ వినియోగంలో ఆధిపత్యం చెలాయించేందుకు జియో, ఎయిర్‌టెల్, స్టార్‌లింక్‌లు ఒక కూటమిగా ఏర్పడుతున్నాయి.
పైగా, ఉపగ్రహ స్పెక్ట్రమ్‌ను ప్రత్యేకంగా వ్యూహాత్మక వినియోగాలకే అంటే రక్షణ, ఇస్రో కార్యకలాపాలకు కేటాయించాల్సి వుంది. ఇది కేవలం స్పెక్ట్రమ్ కేటాయింపునకు సంబంధించిన సమస్యే కాదు, ఒక దేశానికి వుండే ఆర్బిటల్ స్లాట్‌ల సంఖ్యకు సంబంధించిన సమస్య కూడా. కీలకమైన ఆర్బిటల్ స్లాట్‌లను స్వాధీనం చేసుకోవడానికి ఎస్‌యు1.హెచ్ ఉపగ్రహాలను అనుమతించడమే కాదు, మన జాతీయ వనరులను మ్యాపింగ్ చేసుకోవడానికి, వాణిజ్యపరంగా విలువైన డేటాను సేకరించుకునేం దుకు కూడా వీటిని ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు, వాతావరణం, పంటల పరిస్థితి, అలాగే వ్యూహాత్మకమైన లేదా రక్షణ డేటా వంటి వాటిని సేకరించడమనేది మన జాతీయ, భద్రతా ప్రయోజనాలకు వ్యతిరేకం కాగలదు. ముఖ్యంగా ఇస్రో, ఇతర భారతీయ సంస్థలకు ఇలా చేయగల సత్తా వుంది.
ఇటువంటి టెలికం సర్వీసులు దేశ రక్షణకు చాలా కీలకమైనవి. అమెరికా ఆధ్వర్యంలో రష్యాతో చర్చలు జరిపేలా ఉక్రెయిన్ అధ్యక్షుడిపై ఒత్తిడి తెచ్చేందుకు, అలాగే ఉక్రెయిన్ ఖనిజ వనరులను తమకు అప్పగించాలన్న అమెరికా డిమాండ్లను అంగీకరించేలా చేసేందుకు ఉక్రెయిన్ మిలటరీకి స్టార్‌లింక్ సేవలను నిలిపివేస్తామని అమెరికా బెదిరించిన విషయం మనకు తెలిసిందేనని పొలిట్‌బ్యూరో పేర్కొంది. ఒక అమెరికా కంపెనీ అధికంగా వ్యూహాత్మకంగా ఉపగ్రహ స్పెక్ట్రమ్‌ను, ఆర్బిటల్ స్లాట్‌లను స్వాధీనం చేసుకోవడానికి అనుమతించడం, రోదసీ గుత్తాధిపత్యాన్ని సృష్టించడమంటే మన జాతీయ సార్వభౌమాధికారం, భద్రతపై రాజీపడడమేనని సిపిఎం విమర్శించింది.
