వినాశకర విధానాలపై శ్రమజీవుల పోరుబాట

  • దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆందోళనలు, ర్యాలీలు
  • మోడీ సర్కార్‌ తీరుపై కార్మికులు, రైతులు ఆగ్రహం
  • నిరసనల్లో పది లక్షల మంది భాగస్వామ్యం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశవ్యాప్తంగా శ్రమజీవులు పోరుబాట పట్టారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలపై వివిధ రూపాల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని ఆమోదించిన దినంగా ఘనంగా వజ్రోత్సవ వేడుకలు జరుపుతున్నామని చెబుతున్న మోడీ సర్కార్‌ అదే రాజ్యాంగ స్ఫూర్తికి నీరుగారుస్తోందని కార్మిక, కర్షకలోకం నిరసించింది. దేశానికి వినాశనం తలపెట్టేలా మతోన్మాద విద్వేషాలు రెచ్చగొడుతూ, విజయమాల్యా, నీరవ్‌మోడీ, గౌతమ్‌ అదానీ వంటి కుంభకోణాల కాలనాగులు వంటి బడా కార్పొరేట్‌ పెద్దలకు మోడీ సర్కార్‌ కొమ్ముకాస్తోందని, ప్రభుత్వ సంస్థలను, దేశ వనరులను కారుచౌకగా కట్టబెట్టి దేశ ప్రగతిలో భాగస్వాములైన శ్రమజీవులపై అణిచివేత చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు.

కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక చేపట్టిన సార్వత్రిక సమ్మె, అలాగే సంయుక్త కిసాన్‌ మోర్చ్‌ (ఎస్‌కెఎం) ఆధ్వర్యంలో నిర్వహించిన చారిత్రాత్మక ‘చలో ఢిల్లీ’ ఉద్యమానికి నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మంగళవారం దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనల్లో దాదాపు పది లక్షల మంది కార్మికులు, రైతులు పాల్గొన్నారు. రానున్న రోజుల్లో పోరాటాలను మరింత ఉధతం చేస్తామని హెచ్చరించారు. కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక, ఎస్‌కెఎం, రంగాలవారీ పౌర సమాఖ్యలు, సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు, ప్రదర్శనలు, సభలు నిర్వహించారు. వివిధ రాష్ట్రాల్లో ఐదు వందల ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు విజయవంతంగా చేపట్టారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోనూ, పారిశ్రామిక ప్రాంతాల్లోనూ సామూహిక నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ ఆందోళనలకు సంఘీభావంగా పలు కార్యాలయాల వద్ద లంచ్‌ అవర్‌ ర్యాలీలు నిర్వహించారు. నిత్యావసర వస్తువుల ధరలు అనూహ్యంగా పెరగడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కార్మిక, కర్షకలపై లాఠీచార్జ్‌

బిజెపి, దాని భాగస్వామ్య పక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అనేక చోట్ల కార్మిక, కర్షకులపై పోలీసులు లాఠీఛార్జీ చేశారు. బీహార్‌లోని భగల్‌పుర్‌లో కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న కార్మికులు, రైతులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. దీంతో ఆరుగురికి గాయాలయ్యాయి. పలువురిని అరెస్టు చేశారు. శ్రమజీవుల ఆందోళనలకు మద్దతుగా అనేక చోట్ల విద్యార్థులు, యువకులు, మహిళలు, ఉపాధ్యాయులు, ఇతర నిపుణులు, కళా, సాంస్కృతిక, సాహిత్య రంగాలకు చెందిన సంఘాలు, బహుజన సంఘాలు ర్యాలీలు నిర్వహించారు.

రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలి..

కార్మికులు, రైతులు, ప్రజల ప్రయోజనాల కోసం, దేశ ప్రయోజనాల కోసం తక్షణమే జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును శ్రమజీవుల ఆందోళనలకు నేతృత్వం వహించిన సంఘాలు, సమాఖ్యలు విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు రాష్ట్రపతిని ఉద్దేశించి వినతి పత్రాలను అధికారులకు సంబంధిత వేదికల నాయకులు అందజేశారు.

➡️