రాష్ట్రానికి మొండిచెయ్యి

Feb 2,2025 00:37 #ap state, #Central budget
  • వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌కు తగ్గిన కేటాయింపులు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్రప్రభుత్వం మరోసారి ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆశలను అడియాసలు చేసింది. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి మళ్లీ మొండిచెయ్యి చూపించింది. విభజన హామీలను పక్కనపెట్టింది. విభజన చట్టం ప్రకారం వచ్చిన ఏ జాతీయ విద్యా సంస్థకు నిధులు కేటాయించలేదు. విశాఖ రైల్వే జోన్‌, ఎన్‌ఐటి, ఐఐటి, ఐఐఎం, ట్రిపుల్‌ ఐటి, ఐఐఎస్‌ఇఆర్‌, గిరిజన యూనివర్శిటీ, సెంట్రల్‌ యూనివర్శిటీ, దుగరాజపట్నం పోర్టు, కడప స్టీల్‌ ప్లాంట్‌, వైజాగ్‌ మెట్రో, ఎయిమ్స్‌, వెనుకబడిన జిల్లాలకు, రాజధాని నిర్మాణానికి నిధుల ఊసేలేదు. రాష్ట్ర ప్రజల విజ్ఞప్తులను కేంద్రప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. రాజధాని నిర్మాణానికి గతంలో ప్రకటించిన ప్రపంచబ్యాంక్‌ రుణాన్నే పదేపదే ప్రస్తావించడం మినహా చేసిందేమీ లేదు.

స్టీల్‌ప్లాంట్‌కు తగ్గిన కేటాయింపులు

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌కు గతేడాది రూ.8,622 కోట్లు కేటాయిస్తే, ప్రస్తుత బడ్జెట్‌లో రూ.3,295 కోట్లు కేటాయించింది. అంటే గతేడాది కంటే బడ్జెట్‌లో రూ.5,327 కోట్లను తగ్గించింది. పోలవరం ప్రాజెక్టుకు గతేడాది రూ.5,512.50 కోట్లు కేటాయిస్తే, ఈసారి రూ.5,936 కోట్లు కేటాయించింది. విశాఖపట్నం పోర్టుకు రూ.730 కోట్లు కేటాయించారు.

కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా రూ. 57 వేల కోట్లు

కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్‌కి రూ.57,566.31 (4.047 శాతం) కోట్లు వాటా రానుంది. కార్పొరేషన్‌ పన్ను రూ.16,074.48 కోట్లు, ఆదాయపు పన్ను రూ.21,448.05 కోట్లు, సెంట్రల్‌ జిఎస్‌టి రూ.16,759.03 కోట్లు, కస్టమ్స్‌ రూ.2,649.66 కోట్లు, ఎక్సైజ్‌ డ్యూటీ రూ.550.47 కోట్లు, సర్వీస్‌ టాక్స్‌ రూ.1.66 కోట్లు, ఇతర పన్నులు, డ్యూటీస్‌ రూ.82.96 కోట్లు రాష్ట్రానికి రానున్నాయి.

➡️