పాట్నా యూనివర్శిటీలో మూక దాడి- విద్యార్థి మృతి

పాట్నా : బీహార్‌లోని పాట్నా యూనివర్శిటీ లా కాలేజీ ప్రాంగణంలో జరిగిన మూక దాడిలో ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. సోమవారం మధ్యాహ్నం 1:30 గంటలకు 10 మందికిపైగా గుర్తుతెలియని వ్యక్తులు హాకీ స్టిక్‌లు, కర్రలు, ఇనుప రాడ్లు, ఇటుకలతో దాడి చేయడంతో విద్యార్థి అక్కడికక్కడే మరణించాడు. మృతుడ్ని బిఎన్‌ కాలేజీలో ఇంగ్లీష్‌ ఒకేషనల్‌ కోర్సు చదువుతున్న అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థి హర్ష్‌ రాజ్‌ (22)గా గుర్తించారు. ఇతడిది వైశాలి జిల్లా కాగా, పాట్నాలోని బోరింగ్‌ కెనాల్‌ రోడ్‌ ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉండి చదువుకుంటున్నాడు. పరీక్షలు రాసి బయటకు వచ్చిన వెంటనే హర్ష్‌రాజ్‌పై లా కాలేజీ ప్రాంగణంలోని ఆడిటోరియం సమీపంలో ఈ మూక దాడి జరిగింది. తీవ్ర గాయాలపాలైన అతన్ని పాట్నా మెడికల్‌ కాలేజీ అండ్‌ హస్పటల్‌కు తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. ఈ ఏడాది చివరల్లో జరగనున్న పాట్నా యూనివర్శిటీ స్టూడెంట్స్‌ యూనియన్‌ ఎన్నికల్లో పోటీ చేయాలని హర్ష్‌రాజ్‌ నిర్ణయం తీసుకోవడమే, ఆయన హత్యకు కారణమని బంధువులు, స్నేహితులు వెల్లడించారు. సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే హర్ష్‌రాజ్‌ కరోనా సమయంలో చాలా మందికి సహాయం చేశాడు. లోక్‌ నాయక్‌ యువ పరిషత్‌ అనే ఒక సంస్థను కూడా నడుపుతున్నాడు. జర్నలిస్టుగా పనిచేస్తున్న హర్ష్‌రాజ్‌ తండ్రి అజిత్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు సుల్తాన్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. సుమారు 12 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.
అన్ని పరీక్షలనూ రద్దు చేసిన విసి
మూకదాడిలో విద్యార్థి మృతి చెందడంపై పాట్నా యూనివర్శిటీ వైస్‌ ఛాన్సలర్‌ కెసి సిన్హా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధ్యులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని కోరారు. అలాగే, తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకూ ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కేసులో ఇప్పటి వరకూ ఎవర్నీ అరెస్టు చేయలేదని, క్యాంపస్‌లోని సిసిటివి పుటేజీని పరిశీలించి నిందితుల్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.

➡️