అదానీకి సమన్లు అందజేయండి

Mar 13,2025 00:11 #Adani, #court
  • అహ్మదాబాద్‌ సెషన్స్‌ కోర్టును కోరిన కేంద్ర న్యాయ శాఖ

న్యూఢిల్లీ : న్యూయార్క్‌ కోర్టులో ఉన్న కేసుకు సంబంధించి అమెరికా సెక్యూరిటీలు-ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ (ఎస్‌ఇసి) పంపిన సమన్లను అదానీ గ్రూప్‌ చైర్మెన్‌ గౌతమ్‌ అదానీకి అందజేయాల్సిందిగా కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ అహ్మదాబాద్‌ సెషన్స్‌ కోర్టును కోరింది. హేగ్‌ కన్వెన్షన్‌ కింద సహాయం అందజేయాల్సిందిగా ఎస్‌ఇసి నుండి వచ్చిన అభ్యర్థన నేపథ్యంలో కేంద్ర న్యాయ శాఖ ఈ చర్య తీసుకుంది. హేగ్‌ కన్వెన్షన్‌ ప్రకారం నిందితులకు చట్టపరమైన పత్రాలను అందజేయడంలో సభ్య దేశాలు పరస్పరం సహకరించుకోవాల్సి ఉంటుంది. ఎస్‌ఈసీ నుండి వచ్చిన అభ్యర్థనను గత నెల 25వ తేదీన న్యాయ శాఖకు చెందిన లీగల్‌ అఫైర్స్‌ డిపార్ట్‌మెంట్‌ (డిఎల్‌ఎ) అహ్మదాబాద్‌ కోర్టుకు పంపిందని అధికారిక రికార్డులు చెబుతున్నాయి. సమన్లను అదానీకి చెందిన అహ్మదాబాద్‌ చిరునామాలో అందజేయాలని అందులో కోరింది. అదానీ గ్రీన్‌ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌లు అయిన గౌతమ్‌ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్‌ అదానీలు ఇంధన ప్రాజెక్టులు పొందేందుకు భారతీయ అధికారులకు భారీగా ముడుపులు అందించారంటూ ఎస్‌ఈసీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ముడుపుల కేసు అదానీ గ్రూపులో కలకలం రేపింది. అయితే 1977వ సంవత్సరపు ఫారిన్‌ కరప్ట్‌ ప్రాక్టీసెస్‌ యాక్ట్‌ అమలును నిలిపివేస్తూ డోనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయంతో ఆ కంపెనీ ఊపిరి పీల్చుకుంది. అమెరికాలో అదానీపై పెద్దగా చట్టపరమైన చర్యలు ఉండబోవని భావిస్తోంది. ఇదిలావుండగా చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ అమెరికాలో వ్యాపార అవకాశాలను అన్వేషించేందుకు అదానీ గ్రూప్‌ ప్రయత్నాలు ప్రారంభించింది.

➡️