న్యూఢిల్లీ : బెయిల్ ఇచ్చే కేసుల్లో సుదీర్ఘమైన విరామం వుండేలా విచారణ తేదీలు నిర్ణయించడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. వైద్య సంబంధమైన కారణాలపై తాత్కాలికంగా బెయిల్ మంజూరు చేయాలన్న పిటిషన్‌పై విచారణను పంజాబ్ హర్యానా హైకోర్టు రెండు నెలల తర్వాత నిర్ణయించిందని పిటిషన్‌దారు తెలియజేసిన నేపథ్యంలో సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. తన క్లయింట్ రెండేళ్ల కుమార్తెకు అత్యవసరంగా ఆపరేషన్ చేయాల్సి వున్నందున ఆమెకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్‌దారు హైకోర్టును ఆశ్రయించారని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. హైకోర్టులో ఫిబ్రవరి 21న విచారణ జరిపి ఈ విషయాన్ని ఏప్రిల్ 22కు పోస్ట్ చేశారు. ”స్వేచ్ఛను కల్పించడం వంటి అంశాల్లో కోర్టులు మరీ ఎక్కువ కాలంపాటు సాగదీయరాదని బెంచ్ వ్యాఖ్యానించింది. త్వరితగతిన విచారణ జరిపేందుకు పిటిషనర్ హైకోర్టుకు వెళ్లేందుకు అనుమతించింది. కనీసం ఇలాంటి విషయాల్లోనైనా ముందుగా విచారించేలా చూడాలని బెంచ్ హైకోర్టును కోరింది. హైకోర్టులో తన క్లయింట్ రెగ్యులర్ బెయిల్ పెండింగ్‌లో వుందని, విచారణ తేదీని ముందుకు జరపాలన్న క్లయింట్ దరఖాస్తును తిరస్కరించారని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. తాజా వ్యాఖ్యల నేపథ్యంలో కూడా హైకోర్టు దీన్ని తిరస్కరిస్తుందని మీరు భావిస్తున్నారా అని జస్టిస్ గవారు ప్రశ్నించారు.
