ఇసుక తవ్వకాలపై ‘సుప్రీం’ మరోసారి ఆగ్రహం

May 17,2024 08:39 #adjourned, #judgement, #supreem court
  •  జిల్లాల్లో ప్రత్యేక కమిటీలు ఏర్పాటుకు ఆదేశం
  •  4 రోజుల్లోపు ఇసుక అక్రమ మైనింగ్‌ నిలిపేయాలి
  •  క్రిమినల్‌ చర్యలకు ఆదేశం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలపై అత్యున్నత న్యాయస్థానం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను పెడచెవిన పెట్టి, యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగిస్తున్నారని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇసుక అక్రమ తవ్వకాలను నిలిపేయడానికి ప్రతి జిల్లాలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం ఆదేశించింది. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ అభరు ఎస్‌ ఓకా, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌తో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశాలు జారీ చేసింది. కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులతో సహా వివిధ శాఖల అధికారులతో కమిటీల ఏర్పాటుకు ఆదేశించింది. ఫిర్యాదులు, పరిష్కారం కోసం ఒక ప్రత్యేక వ్యవస్థను తీసుకురావాలని మార్గదర్శకాల్లో ధర్మాసనం పేర్కొంది. ఒక టోల్‌ ఫ్రీ నెంబర్‌, మెయిల్‌ ఐడి ఏర్పాటుచేసి, సాధారణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్దేశం చేసింది. ఈ వ్యవస్థకు వచ్చే ఫిర్యాదులను జిల్లా కమిటీలకు పంపి వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చింది. రెండు, మూడు రోజుల్లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసి, ప్రధాన ప్రతివాదిగా ఉన్న దందా నాగేంద్ర కుమార్‌కు సమాచారం ఇవ్వాలని సూచించింది.
నాలుగు రోజుల్లోపు ఇసుక అక్రమ మైనింగ్‌ జరుగుతున్న రీచ్‌లను సందర్శించి అక్కడి కార్యకలాపాలు నిలిపేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొంది. ఇసుక అక్రమ తవ్వకాలను నిషేధించడానికి పెద్దయెత్తున పబ్లిసిటీ ఇవ్వాలని తెలిపింది. తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే, కోర్టు ధిక్కార చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కమిటీలోని అధికారులు సుప్రీంకోర్టు నియమించిన అధికారులుగా గుర్తెరిగి విధులను నిర్వర్తించాలని ధర్మాసనం హెచ్చరించింది. ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాల్లో ధర్మాసనం పేర్కొంది. ఎపిలో యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని సుప్రీంకోర్టుకు కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ మధ్యంతర నివేదిక సమర్పించింది. కేంద్ర మంత్రిత్వశాఖ కమిటీ ధ్రువీకరణతో ధర్మాసనం మార్గదర్శకాలు జారీ చేసింది. రూ.10 వేల కోట్లకు పైగా ఇసుక అక్రమ రవాణా జరిగిందని సుప్రీంకోర్టు దృష్టికి ప్రతివాది దండా నాగేంద్ర కుమార్‌ తరపున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా పేర్కొన్నారు. గత నెల 29న, ఈ నెల 10న సుప్రీంకోర్టు ఆదేశాల తరువాత కూడా, ఎపి ప్రభుత్వం కొనసాగిస్తున్న ఇసుక అక్రమ తవ్వకాల ఫొటోలు, ఆధారాలను ధర్మాసనం ముందు ప్రతివాది దండా నాగేంద్ర కుమార్‌ ఉంచారు. జిపిఎస్‌ మ్యాపింగ్‌ కెమెరాతో సేకరించిన ఆధారాలు, మీడియాలో వచ్చిన కథనాలను సుప్రీంకోర్టుకు సిద్దార్థ లూథ్రా అందించారు. అక్రమ ఇసుక దారులు, రాష్ట్ర ప్రభుత్వం కలిసే నడుచుకుంటున్నారని లూథ్రా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, కంపెనీలు ఒకరి చేతిలో ఒకరుగా కలిసిమెలిసి అక్రమ ఇసుక మైనింగ్‌ చేస్తున్నారని వివరించారు. కేంద్ర పర్యావరణ, అటవీశాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయికి వెళ్లి ఇసుక అక్రమ తవ్వకాలు ఆపేశారా? లేదా? అన్నది తనిఖీ చేయాలని ధర్మాసనం ఆదేశించింది. కేంద్ర అధికారులు సందర్శించే విషయాన్ని రాష్ట్ర అధికారులకు చెప్పాల్సిన అవసరం లేదని, సమాచారం కూడా ఇవ్వొద్దని ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. ఇసుక అక్రమ తవ్వకాలపై వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే తీసుకున్న చర్యలను వివరిస్తూ ఎపి ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఆ వివరాలు పట్టించుకోకుండా, ధర్మాసనం మార్గదర్శకాలు జారీ చేసింది. జులై 9 లోపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక అందించాలని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణ జులై 15న చేపడతామని, అప్పటిలోగా ఇతర వివరాలు కూడా కోర్టుకు అందించాలని సూచించింది.

➡️